“డిజిటల్ భారత్ నిధి” పథకం కింద ఏజెన్సీ ప్రాంతాల్లో 5జీ సేవలు

“డిజిటల్ భారత్ నిధి” పథకం కింద ఏజెన్సీ ప్రాంతాల్లో 5జీ సేవలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం డిజిటల్ రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీయన్ మాధవ్ తెలిపారు.  దేశంలో 5జీ నెట్‌వర్క్ విస్తరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వ “డిజిటల్ భారత్ నిధి” పథకం కింద రాష్ట్రంలో 707 చోట్ల నూతన సెల్ టవర్ల ఏర్పాటు కు రంగం సిద్ధం చేస్తున్నారని చెప్పారు.  ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 1668 నెట్‌వర్క్ టవర్లకు అదనంగా కొత్త టవర్లు చేరడంతో మొత్తం సంఖ్య 2375కు  పెరగనుందని ఆయన వెల్లడించారు.
“డిజిటల్ భారత్ నిధి” పథకం కింద కొత్త సెల్ టవర్ల కోసం అవసరమైన స్థలాలను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనుండగా, నిర్మాణ ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు.  ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొంటూ, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 101, పార్వతీపురం మన్యం జిల్లాలో 78 కొత్త టవర్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించారని తెలిపారు.
రెవెన్యూ, అటవీ శాఖల అనుమతుల్లో కొంత జాప్యం ఉన్నప్పటికీ, నెట్‌వర్క్ సేవలను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
గత కొన్ని సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న దూరదృష్టి నిర్ణయాల వల్ల డిజిటల్ ఇండియా కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల వరకు విస్తరించిందని మాధవ్ తెలిపారు. యూపీఐ చెల్లింపులు, డిజిటల్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ ప్రభుత్వ సేవలు, ఆధార్ ఆధారిత సేవలు ప్రజల జీవితాలను సులభతరం చేశాయని తెలిపారు. 
 
భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ లావాదేవీలు జరుగుతున్న దేశంగా ఎదగడం ప్రధాని మోదీ సమర్థ నాయకత్వానికి నిదర్శనమని ఆయన కొనియాడారు. డిజిటల్ సాంకేతికత ద్వారా పారదర్శకత పెరిగి అవినీతి తగ్గిందని, సామాన్య ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా అందుతున్నాయని చెప్పారు. యువత డిజిటల్ టెక్నాలజీని సద్వినియోగం చేసుకుని స్టార్టప్‌లు, ఆవిష్కరణల ద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడాలని పీవీయన్ మాధవ్ పిలుపునిచ్చారు.