2027 గోదావరి పుష్కరాల లోపు ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు పూర్తి సహకారం అందించాలని జలశక్తి మంత్రి సి ఆర్ పాటిల్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. సోమవారం ఆయనతో సమావేశంపై తొలిదశలో 41.15 మీటర్ల మేర నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన నిర్మాణాలను పూర్తి చేయాలని కోరారు. 2026 ఏప్రిల్ 2 నాటికి కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పూర్తి అయ్యిందని, గ్యాప్ 1, గ్యాప్ 2 లలో కీలకమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు.
ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయ సేకరణ పెండింగ్‌లో ఉందన్న కారణంతో 2011లో ఇచ్చిన స్టాప్ వర్క్ ఆర్డర్ ఉత్తర్వులను శాశ్వతంగా ఉపసంహరించుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రిని ఆయన కోరారు. దీని వల్ల పోలవరం ప్రాజెక్టు పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా వేగంగా చేపట్టేందుకు వీలవుతుందని తెలిపారు. సాగునీటి అవసరాల దృష్ట్యా మొదట నిర్ణయించిన దానికంటే కుడి, ఎడమ కాలువల సామర్ధ్యాన్ని 17,500 క్యూసెక్కులకు పెంచినట్టు వివరించారు.
ప్రస్తుతం కుడి కాలువ 95 శాతం మేర, ఎడమ కాలువ పనులు 78 శాతం మేర పూర్తి అయినట్టు ఆయన వెల్లడించారు. కాలువల సామర్ధ్యం పెంచిన మేరకు నిధులను రీఎంబర్సు చేయాలని జలశక్తి శాఖ మంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు తదుపరి పనులకు సంబంధించి అవసరమైన నిధులను కూడా మంజూరు చేయాలని కోరారు. ప్రధానమంత్రి కృషి సీంచాయి యోజన కింద రాష్ట్రంలోని వివిధ పథకాల పునరుద్ధరణ, ఆధునీకరణకు నిధులు మంజూరు కోరుతూ లేఖ అందించారు.
హర్ ఖేత్ కో పానీ కార్యక్రమంలో భాగంగా చెరువులు, కుంటల మరమ్మతులు, పునరుద్ధరణ ,ఆధునీకరణ, కాలువల పూడిక తీత, గట్ల బలోపేతం లాంటి పనులు చేపట్టాల్సి ఉందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 297 నీటి వనరుల పునరుద్ధరణ కోసం రూ.285 కోట్ల నిధుల్ని విడుదల చేయాలని కోరారు. కాగా, సుప్రీం కోర్టు తుది తీర్పు వచ్చేంత వరకూ ఆలమట్టి ఎత్తు పెంచే అంశంపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయవద్దని చంద్రబాబు స్పష్టం చేశారు.
అప్పర్ కృష్ణా ప్రాజెక్ట్ ఫేజ్-III కింద భూసేకరణ ఇతర సన్నాహక పనులు చేయకుండా కర్ణాటకను ఆదేశించాలని, సుప్రీం కోర్టు తుది తీర్పు వచ్చేంత వరకూ యథాతథ స్థితిని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల దాహార్తిని తీర్చే పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. వంశధారపై నేరడి బ్యారేజ్ నిర్మాణానికి జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం అవసరమైన భూసేకరణ కోసం ఒడిశాను ఆదేశించాల్సిందిగా కోరారు.

More Stories
కడపలో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు పనులపై ఉద్రిక్తత
యూరియా, డిఎపి ఎరువుల వినియోగంపై నిఘా
పుట్టపర్తి యుద్ధ విమానాలతో మారనున్న రాయలసీమ తలరాత