మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్

మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు గురువారం కొత్త మలుపు తిరిగింది. అప్పటి డిజిపి మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్టు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబి) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సంచలన విషయం బయట పెట్టారు. నాలుగవ సారి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు హాజరైన ప్రభాకర్‌రావు నిన్న మొన్నటి వరకు రివ్యూ కమిటీ ఆమోదంతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పిన విషయం తెలిసిందే. 

కానీ తాజాగా ఒక్కసారిగా ఇది అప్పటి డిజిపి మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకే జరిగిందని సిట్‌కు వెల్లడించారు. దీంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగినట్టు అయింది. అమెరికా నుంచి వచ్చిన తరువాత ప్రభాకర్ రావును సిట్ అధికారులు వరుసగా విచారిస్తున్నారు. ఈ నేపథ్యం లో గురువారం నాలుగోసారి ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. 

మాజీ డిజిపి మహేందర్ రెడ్డి చెపితేనే ఫోన్ ట్యాప్ చేసినట్టు ప్రభాకర్ రావు సిట్‌కు తెలియ జేయడంతో ఈ కేసులో మహేందర్‌రెడ్డిని కూడా సిట్ విచారణకు పిలుస్తుందా? లేదా అనే చర్చకు దారితీసింది. ఈ క్రమంలో మాజీ డిజిపి మహేందర్ రెడ్డి స్టేట్‌మెంట్ తీసుకునే విషయంలో సిట్ అధికారులు ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని సమాచారం. ఈ కేసులో ఇప్పటికే సుమారు 600 ఫోన్లు ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది. 

కాగా, ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదని, విచారణలో చెప్పిన సమాధానాలే చెపుతుండటంతో అధికారులు అసహనం వ్యక్తం చేశారు. దీంతో ప్రభాకర్ రావుకు కల్పించిన రిలీఫ్‌ను సస్పెండ్ చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సిట్ భావించింది. కానీ ఆయన ఏకంగా మాజీ డిజిపి పేరు బయట పెట్టడంతో ఇంకా ఇందులో ఎవరెవ్వరికి ప్రమేయం ఉందనేది సిట్ కూపీ లాగబోతున్నట్టు తెలిసింది.