బనకచర్ల వివాదంపై త్వరలో ఇద్దరు సీఎంలతో భేటీ

బనకచర్ల వివాదంపై త్వరలో ఇద్దరు సీఎంలతో భేటీ
గోదావరి -బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదంపై త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిలకు కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ హామీనిచ్చారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రితో భేటీ అనంతరం మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. 
 
అంతకుముందు రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఎపి ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి- బనకచర్ల ప్రాజెక్టు ప్రీ ఫీజుబిలి టీ రిపోర్టును తిరస్కరించాలని జల్‌శక్తి మంత్రి సీ ఆర్ పాటిల్‌కు వారిద్దరూ విజ్ఞప్తి చేశారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో గో దావరి జలవివాదాల ట్రైబ్యునల్-1980 (జీడబ్ల్యూడిటి), ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం- 2014 లకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహారిస్తోందని కేంద్ర మంత్రికి వారు ఫిర్యాదు చేశారు. 
 
బనకచర్ల ప్రాజెక్టు అనుమతుల విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ, పర్యావరణ శాఖ వ్యవహారిస్తున్న తీరుతో తెలంగాణ ప్రజలు, రైతుల్లో ఆందోళనలు నెలకొన్నాయని కేంద్ర మంత్రి దృష్టికి వారు తీసుకెళ్లారు. గోదావరి వరద జలాల ఆధారంగా బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదిస్తున్నామని ఎపి చెబుతోందని, జీడబ్ల్యూడిటి -1980లో వరద జలాలు, మిగులు జలాల ప్రస్తావనే లేదని పేర్కొన్నారు.
2014 ఎపి పునర్విభజన చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా నూతన ప్రాజెక్ట్ నిర్మించాలనుకుంటే ముందు ఆ నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), జల్‌శక్తి మంత్రి అధ్యక్షతన రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండే ఎపెక్స్ కౌన్సిల్లో చర్చించి అనుమతి పొందాలని బనకచర్ల విషయంలో ఎపి వాటిని ఉల్లంఘిస్తోందని కేంద్ర మంత్రికి సిఎం రేవంత్ తెలియజేశారు. 

బనకచర్ల విషయంలో ఏ నిబంధనలు పాటించని ఆంధ్రప్రదేశ్ వరద జలాల ఆధారంగా ప్రాజెక్ట్ చేపడుతున్నామని చెబుతుండడం తీవ్ర అభ్యంతరకరమని జల్‌శక్తి మంత్రితో సిఎం పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ పరిధిలోని సాంకేతిక సలహా మండలి నుంచి అనుమతులు పొందకుండానే వరద జలాల పేరుతో పోలవరం కింద పురుషోత్తపట్నం, వెంకటనగరం, పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకాలను ఎపి చేపట్టిందని కేంద్ర మంత్రికి  ఫిర్యాదు చేశారు.

కాగా, తెలంగాణకు గోదావరి నదిలో 1,000 టిఎంసిలు, కృష్ణానదిలో 500 టిఎంసిలు మొత్తంగా 1,500 టిఎంసిల నీటి వినియోగానికి కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసి) జారీ చేయాలని, దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 1500 టిఎంసిల నీటితో కోటిన్నర ఎకరాలకు నీరు అందుతుందని ఆ తర్వాత ఎపి చేపట్టే ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియను పరిశీలిస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.