
గోదావరి కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులపై సమగ్రమైన నివేదిక తయారుచేసి కేంద్రంపై ఒత్తిడికి ఎంపీలకు అవగాహన కల్పించేందుకు ఒక నివేదిక తయారు చేసి అన్ని పార్టీల ప్రతినిధులకు అందించాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ సలహాదారు, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఆదిత్యనాధ్ దాస్‌ను సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ప్రాజెక్టుపై ఒక పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఏర్పాటు చేశారు.
ఈ సమావేశానికి తెలంగాణలోని అన్ని పార్టీల ఎంపీలను ఆహ్వానించారు. బీజేపీ తరపున డీకే అరుణ, రఘునందన్ రావు, బీఆర్‌ఎస్ తరపున ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎంఐఎం తరపున అసదుద్దీన్ ఒవైసీ హాజరయ్యారు. అలాగే కాంగ్రెస్ ఎంపీలు రేణుకా చౌదరి, రఘురామ్‌రెడ్డి, రఘువీర్, చామల కిరణ్ కుమార్‌రెడ్డి, బలరాం నాయక్, మల్లు రవి, అనిల్‌కుమార్‌యాదవ్, సురేష్ షెట్కార్ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఎంపీల నుండి సలహాలు, సూచనలు సేకరించి ప్రాజెక్టును అడ్డుకోవడానికి తదుపరి చర్యలపై ప్రణాళికను ప్రభుత్వం రచించనుంది. కేంద్రం ఈ ప్రాజెక్టుకు అనుమతిస్తే సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. తమ ప్రభుత్వానికి తెలంగాణ రైతాంగ ప్రయోజనాలే ముఖ్యమని సిఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా రైతుల ప్రయోజనాలు ఎజెండాగా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా మనందరం కలిసి పనిచేయాలని కోరారు.
రాజకీయ లబ్ది కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయలేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఏర్పాటు చేశామని వివరించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 21.-9.-2016 అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసిందని, ఆ సమావేశంలో మొట్టమొదట గోదావరిపై 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని ఆనాటి సీఎం కెసీఆర్ వెల్లడించారని, అసలు ఆ 3వేల టిఎంసిల నీరనే బ్రహ్మ పదార్థం ఎక్కడినుంచి వచ్చిం దో ఆపార్టీ వారే వెల్లడించాల్సిన అవసరం ఉందని ప్రశ్నించారు.
ఆ సమావేశంలో హరీశ్‌రావు కూడా పాల్గొన్నారని గుర్తు చేశారు. మళ్లీ 13 ఆగస్టు 2019లో రాయలసీమను రతనాల సీమ చేస్తామని ఆనాటి తెలంగాణ సీఎం కెసీఆర్ ప్రకటించారని, గోదావరి జలాలలను రాయలసీమకు తరలించాలని కెసిఆర్, జగన్ ప్రగతిభవన్‌లో నాలుగుసార్లు సమావేశమై నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
ఇరు రాష్ట్రాల సిఎంల భేటీ వివరాలను ఆనాటి మంత్రులు ఈటెల రాజేందర్, బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించారని, ఈ మీటింగ్ మినిట్స్ ను రిఫరెన్స్‌గా చూపి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు బనకచర్లను గుదిబండగా మార్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఇందుకు సంబంధించి అఫీషియల్ డాక్యుమెంట్స్ మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
More Stories
1977లో ఓటమి భయంతో ఆర్ఎస్ఎస్ చెంతకు ఇందిరా గాంధీ!
వామపక్ష తీవ్రవాదంపై మహారాష్ట్ర కఠిన బిల్!
‘స్థానిక’ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్