బనకచర్లపై అందరితో చర్చించాకే నిర్ణయం

బనకచర్లపై అందరితో చర్చించాకే నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి బనకచర్ల లింకు ప్రాజెక్టుకు సంబంధించి మంత్రిత్వ శాఖ నిబంధనలకు అనుగుణంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి బుధవారం సాయంత్రం ఢిల్లీలో సీఆర్ పాటిల్ ను కలిశారు. గోదావరి -బనకచర్ల లింక్ ప్రాజెక్టు గురించి వీరిద్దరూ చర్చించారు.

బనకచర్ల ప్రాజెక్టుపై పూర్తిస్థాయిలో పరిశీలన చేసిన తర్వాతే ముందుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారని కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఈ ప్రాజెక్టును అన్ని భాగస్వామ్య పక్షాలతో చర్చించిన తర్వాతే పారదర్శకమైన పద్ధతిలోనే ప్రాజెక్టుకు సంబంధించిన నిర్ణయం ఉంటుందని జలశక్తి మంత్రి చెప్పారని తెలిపారు. ఈ విషయంలో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారని తెలిపారు.

కాగా, హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి సంబంధించిన డిపిఆర్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పరిశీలనలో ఉందని కిషన్‌రెడ్డి తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో బుధవారం భేటీ అయ్యారు. తెలంగాణ అభివృద్ధికి సంబంధించి పట్టణాభివృద్ధి శాఖ తరఫున పెండింగ్‌లో ఉన్న అంశాలను ఖట్టర్‌కు వివరించారు.  ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పనులకు కేంద్ర ప్రభుత్వ సహకారం అంశంపై చర్చ జరిగిందని కిషన్‌రెడ్డి తెలిపారు.

మెట్రో రెండో దశ కోసం తెలంగాణ ప్రభుత్వం పంపించిన డీపీఆర్ ఇటీవలే అందిందని ఖట్టర్ తెలిపారని కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఈ డీపీఆర్‌ను మంత్రిత్వశాఖ అధికారులు పరిశీలిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.  గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డిపిఆర్‌లో కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలను చేసిందని తెలిపారు. ఆ సూచనలను పరిగణనలోకి తీసుకుని ఈ డీపీఆర్ రూపొందించి ఉంటారని ఖట్టర్ ఆశాభావం వ్యక్తం చేశారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం సహకారం అందిస్తుందని ఆయన వెల్లడించారు.