
2027 జులై 23 నుంచి 12 రోజుల పాటు జరుగనున్న గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. సుమారు రూ. 500 కోట్ల వ్యయంతో సన్నాహాలు జరపాలని ప్రాధమికంగా నిర్ణయించారు. ఇటీవల ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళాకు వెళ్లి అక్కడి ఏర్పాట్లను తెలంగాణ దేవాదాయశాఖ అధికారులు పరిశీలించి వచ్చారు.
మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరం వద్ద పుట్టిన గోదావరి తెలంగాణలోని బాసర నుంచి ధర్మపురి, మంథని, కాళేశ్వరం, పర్ణశాల, భద్రాచలం పుణ్యక్షేత్రాల గుండా ప్రవహించి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. ఇందులో దక్షిణ అయోధ్యగా పిలిచే భద్రాచలానికి ప్రాధాన్యమిచ్చేలా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ప్రతిపాదించిన నిధులు వస్తే తాత్కాలిక ఏర్పాట్లతో పాటు శాశ్వత నిర్మాణాలకు కూడా అవకాశం లభిస్తుందనేటువంటి ఆశలు చిగురిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నదీ తీరంలో 106 ప్రధాన ఘాట్లు ఉండగా వీటిని ఆధునికీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భద్రాచలం గోదావరి వద్ద 2003లో ప్రధాన స్నాన ఘాట్ను నిర్మించారు. ఇది చాలకపోవటంతో 2015లో మరో 2 ఘాట్‌లు ఏర్పాటుచేశారు. వీటికి మరమ్మతులను చేపట్టాల్సి ఉంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొత్త ఘాట్లతో పాటు షవర్ బాత్‌లను సమకూర్చాలి.
దెబ్బతిన్న వాచ్ టవర్లను బాగు చేయాల్సి ఉంది. వరదల నుంచి రక్షణగా ఉండేందుకు 1999లో నిర్మించినటువంటి కరకట్టకు మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. టూరిస్ట్లను ఆకట్టుకునేందుకు వీలుగా కట్టను సుందరీకరించాలి. నిత్యం రామాలయానికి వచ్చేటువంటి భక్తులు ఎక్కువ సేపు గడిపేందుకు సదుపాయాలు కల్పించాలి. ఇప్పుటికే ఉన్న బాపూ బొమ్మలకు తోడు రామాయణ దృశ్యాలు, ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరిసేవిధంగా బొమ్మల గ్యాలరీని ఏర్పాటు చేయాలి.
2015 పుష్కరాలకు జిల్లాలోని ఘాట్లలో 50 లక్షల మంది భక్తులు నదీస్నానాలు ఆచరించారు. ఈసారి మణుగూరు, దుమ్ముగూడెం, బూర్గంపాడు, భద్రాచలం లాంటి చోట్ల భక్తుల సంఖ్య రెట్టింపవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాచలం నుంచి ఎటపాక వరకు కరకట్ట రక్షణ గోడలు వంగిపోతున్నాయి. ఈ గోడలను సరిచేయాలి లేదా కొత్తవాటిని నిర్మించాల్సి ఉంటుంది. వీటన్నింటికీ పుష్కరాల బడ్జెట్‌లో నిధులను కేటాయించాలని అధికారులు ప్రతిపాదించనున్నారు.
మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరం వద్ద పుట్టిన గోదావరి తెలంగాణలోని బాసర నుంచి ధర్మపురి, మంథని, కాళేశ్వరం, పర్ణశాల, భద్రాచలం పుణ్యక్షేత్రాల మీదుగా ప్రవహించి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. ఇందులో దక్షిణ అయోధ్యగా పిలిచే భద్రాచలానికి ప్రాధాన్యమిచ్చేలా ప్రణాళికలను రూపొందిస్తున్నారు.
More Stories
హెచ్సీఏ వ్యవహారంపై ఈడీ దృష్టి
రాజాసింగ్ రాజీనామా ఆమోదించిన జేపీ నడ్డా
‘స్థానిక’ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్