
వివాదాలతో జి 7 సదస్సు ముగిసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లేకుండానే కనానాస్కిస్‌లో సదస్సు చివరి రోజైన మంగళవారం జి 7 దేశాల నేతలు సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించినా, ఎలాంటి సంయుక్త ప్రకటన లేదా డిక్లరేషన్ లేకుండా సదస్సు ముగిసింది. సదస్సు ముగిసిన తర్వాత అనేక ప్రకటనలు లేదా నేతల హామీలు వెలువడ్డాయి.
ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఎఐని సురక్షితమైన, బాధ్యతాయుతమైన, విశ్వసనీయమైన రీతిలో అమలు చేయాలని, డిజిటల్ అంతరాలను రూపుమాపాలని, ఆర్థిక వ్యవస్థలు వృద్ధి చెందడానికి వీలుగా సాంకేతికతను పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేలా పరస్పర సహకారం పెంపొందించుకోవాలని, అంతర్జాతీయ సవాళ్ళను పరిష్కరించుకోవాలని, ప్రజల భద్రతకు హామీ కల్పించాలని ఇలా పలు ప్రకటనలు జారీ అయ్యాయి.
సదస్సు ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో కెనడా ప్రధాని మార్క్ కార్నే మాట్లాడుతూ, రెండు రోజులుగా జరిగిన చర్చలు అరమరికలు లేని రీతిలో సాగాయని చెప్పారు. అనేక అంశాలపై వివిధ రకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయని పేర్కొన్నారు. వ్యూహాత్మక మార్పిడులు జరిగాయని, కొన్ని సమస్యలకు ఉమ్మడి పరిష్కారాలు కనుగొనేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయని తెలిపారు.
బహుళపక్షవాదం తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్న సమయంలో ఇది చాలా విలువైనదని కార్నే వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌పై సంయుక్త ప్రకటన చేయలేదు. కెనడా మాత్రం ఉక్రెయిన్‌కు మద్దతుగా రష్యాపై మరికొన్ని ఆంక్షలను విధించింది. మరోవైపు సదస్సు జరుగుతుండగా, కాల్గరీ, బాన్ఫ్ వీధుల్లో వందలాదిమంది ఆందోళనకారులు నిరసనలు నిర్వహించారు. కెనడాను ఆక్రమించుకుంటామని ట్రంప్ చేసిన బెదిరింపులను నిరసించారు. పలు సమస్యలకు పరిష్కారాలు కావాలంటూ వారు నినాదాలు చేశారు.
More Stories
హసీనాను స్వదేశానికి రప్పించేందుకు విశ్వప్రయత్నాలు
వంద ఏళ్లైనా ఏఐతో ప్రోగ్రామర్లను భర్తీ చేయలేరు
భారత్ ను మినహాయించి 22 దేశాలపై ట్రంప్ సుంకాలను