రూ.3 వేల కొత్త ఫాస్టాగ్‌ తో ఏడాదంతా ప్రయాణం

రూ.3 వేల కొత్త ఫాస్టాగ్‌ తో ఏడాదంతా ప్రయాణం
జాతీయ రహదారులపై ప్రయాణాన్ని సులభతరం చేయడానికి కొత్త ఫాస్టాగ్‌ పాలసీని  కేంద్రం తీసుకొచ్చింది. అన్ని రహదారులపై ప్రతిసారీ టోల్‌ట్యాక్స్‌ చెల్లించాల్సిన పనిలేకుండా ఒకేసారి ఏడాదికి చెల్లించేలా ఫాస్టాగ్‌ ఆధారిత వార్షిక పాస్‌ను తీసుకొచ్చింది. ఈ పాస్‌ ద్వారా వాహనదారులు రూ.3వేలు చెల్లించి ఏడాదంతా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై ప్రయాణించవచ్చు.
 
సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ బుధవారం ఎక్స్‌లో పంచుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజైన ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ వార్షిక పాస్‌ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. యాక్టివేట్‌ చేసిన పాస్‌లు ఏడాదిపాటు లేదా 200 ట్రిప్పులు (ఏది ముందైతే అది) చెల్లుబాటు అవుతాయని వెల్లడించారు. కార్లు, వ్యాన్లు వంటి నాన్‌ కమర్షియల్‌ వాహనాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. 
ఈ పాస్ యాక్టివేషన్‌ కోసం రాజ్‌మార్గ్‌ యాప్‌తోపాటు ఎన్ హెచ్ ఎ ఐ, ఎంఓఆర్ టిహెచ్ వెబ్‌సైట్లలో ఈ లింక్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. లక్షలాది మంది ప్రైవేటు వాహనదారులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఇస్తుందని గడ్కరీ పేర్కొన్నారు. హైవేలపై సగటున ప్రతీ 60 కి.మీ పరిధిలో ఒక టోల్ ప్లాజా ఉంటుంది. ఆయా చోట్ల ఆగకుండా నిరాటంకంగా ప్రయాణాలు సాగించాలని భావించే వారికి ఫాస్టాగ్ వార్షిక పాస్ ప్రయోజనకరంగా ఉంటుంది. నిత్యం హైవేలపై రాకపోకలు సాగించే వారు దీన్ని ఎంపిక చేసుకోవచ్చు. 

ఫలితంగా ఎంతో విలువైన సమయం ఆదా అవుతుంది. పదేపదే టోల్ ప్లాజాల వద్ద ఆగి, వాహన లైన్లలో ఉండి చెల్లింపులు జరపాల్సిన అవసరం ఉండదు. సింగిల్ పేమెంట్‌తో ఫాస్టాగ్ వార్షిక పాస్‌ను తీసుకుంటే, ఏడాదంతా టోల్ ప్లాజాల వద్ద ఆగి చెల్లింపులు జరపాల్సిన అవసరం తప్పుతుంది. వార్షిక పాస్‌ల జారీ ద్వారా టోల్ ప్లాజాల వద్ద వాహన క్యూలైన్లను చాలావరకు తగ్గించవచ్చని కేంద్ర రవాణా శాఖ భావిస్తోంది.

నెలవారీ ఫాస్టాగ్ పాస్‌ ధర ప్రస్తుతం రూ.340గా ఉంది. అంటే సంవత్సరానికి దాదాపు రూ.4,080 దాకా ఖర్చవుతోంది. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి రానున్న వార్షిక ఫాస్టాగ్ పాస్ ధర కేవలం రూ.3వేలే. దీన్ని వాహనదారులు తీసుకుంటే దాదాపు రూ.1,080 దాకా ఆదా అవుతుంది. దీంతోపాటు ఏడాదంతా హైవేలపై నిరాటంకంగా రాకపోకలు సాగించవచ్చు.