
గతవారం అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనపై అధికారులు విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే, దర్యాప్తులో కీలకమైన బ్లాక్‌బాక్స్ ప్రమాదంలో దెబ్బతిన్నట్లు తెలిసింది. దీంతో అందులోని డేటాను విశ్లేషించేందుకు బ్లాక్‌బాక్స్‌ను విదేశాలకు పంపనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రమాదం జరిగిన దాదాపు 27 గంటల తర్వాత ఈ బ్లాక్‌బాక్సును విమానం కూలిన బిల్డింగ్‌పై గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు ఈ బ్లాక్ బాక్స్ చాలా కీలకం. అయితే, ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో బ్లాక్‌బాక్స్ దెబ్బతిన్నట్లు తెలిసింది. దీంతో అందులోని డేటాను విశ్లేషించేందుకు దెబ్బతిన్న బ్లాక్‌బాక్స్‌ను విదేశాలకు పంపనున్నట్లు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. వాషింగ్టన్ డీసీలోని జాతీయ రవాణా భద్రతా బోర్డుకు పంపే అవకాశం ఉందని సదరు కథనాలు వెల్లడించాయి.
బ్లాక్ బాక్స్‌లో రెండు విభాగాలు ఉంటాయి. అవి కాక్‌పిట్ వాయిస్ రికార్డు, ప్లయిట్ డేటా రికార్డు. వీటి ద్వారా విమానం ప్రమాదానికి గురైన సమయంలో ఏం జరిగిందనే విషయం వీటిలో నిక్షిప్తమై ఉంటుంది. ఈ బ్లాక్ బాక్స్‌లో నిక్షిప్తమైన డేటా వెలికి తీస్తేనే కానీ.. ఈ విమాన ప్రమాదానికి గల కారణాలు ఏమిటనే దానిపై ఒక స్పష్టత వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
కాగా, దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా తన అంతర్జాతీయ విమాన సేవలను తాత్కాలికంగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. వైడ్‌బాడీ విమాన కార్యకలాపాలను జులై మధ్య వరకూ సుమారు 15 శాతం వరకు తగ్గించనున్నట్లు వెల్లడించింది. నిర్వహణపరమైన ఇబ్బందులతో గడిచిన ఆరు రోజుల్లో సంస్థకు చెందిన దాదాపు 83 అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయినట్లు సమాచారం.
More Stories
కోయంబత్తూరు పేలుళ్ల నిందితుడు 29 ఏళ్ళకు అరెస్ట్
యువతలో పెరుగుతున్న అక్యూట్ మైలోయిడ్ లుకేమియా
గుజరాత్లో వంతెన కూలి 10 మంది మృతి