వీసాల అనిశ్చితతో అమెరికాలో చదువులపై వెనకడుగు!

వీసాల అనిశ్చితతో అమెరికాలో చదువులపై వెనకడుగు!
 
* విదేశీ విద్యార్థుల అమెరికా వీసా పక్రియ ప్రారంభం

డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యార్థి వీసాల చుట్టూ నెలకొన్న అనిశ్చితతో అమెరికా చదువుల పట్ల ఆసక్తి చూపే వేలాదిమంది భారతీయ విద్యార్థులు ఇప్పుడు వెనుకడుగు వేస్తున్నారు.  ఇప్పటికే అక్కడి యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు సహితం దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.
అమెరికాలో విధానపరమైన అస్థిరత కారణంగా తల్లిదండ్రులు ఇప్పుడు అమెరికా విద్యపై పునరాలోచనలో పడ్డారు.
2024లో 3.31 లక్షల మందికిపైగా భారతీయ విద్యార్థులు అమెరికా యూనివర్సిటీలు, కళాశాలల్లో చేరారు. ఒకప్పుడు అమెరికాలో అవకాశాలు సమృద్ధిగా కనిపించినప్పటికీ ఇప్పుడు పరిస్థితులు తిరగబడ్డాయి. చాలామంది అనిశ్చితిని, భవిష్యత్తుపై ఆందోళనను ఎదుర్కొంటున్నారు. మరోవైపు, అమెరికాలో అవకాశం వచ్చినా వెళ్లాలా? వద్దా? అని మరికొందరు ఆలోచిస్తున్నారు. ఒకవేళ వెళ్లినా ఒక సెమిస్టర్‌ తర్వాత వెనక్కి పంపితే అప్పుడు పరిస్థితేంటని, ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడి సంగతేంటని చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఇది విద్యార్థులతోపాటు వారి కుటుంబాలను కూడా ఆందోళనకు గురిచేస్తున్నది.

అమెరికాలో అస్థిర పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులు ఇప్పుడు ఇతర దేశాల వైపు చూస్తున్నారు. విద్యార్థులు అమెరికా బదులుగా హాంకాంగ్‌, యూకే, యూరప్‌, ఆస్ట్రేలియాల పట్ల ఆసక్తి చూపే పరిస్థితులు నెలకొంటున్నాయి.  హాం కాంగ్‌లో స్కాలర్‌షిప్‌, ఆర్థిక సాయం వంటి అవకాశాలు కూడా లభిస్తాయని చెబుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను అమెరికా చదువుల పట్ల ప్రోత్సహిస్తూనే వారి భద్రతను, మనశ్శాంతిని పణంగా పెట్టేందుకు సిద్దపడటం లేదు.

అమెరికా విధాన మార్పులతో ప్రతి ఒక్కరి ఆర్థిక స్థిరత్వం, వారి పిల్లల భవిష్యత్తు రెండూ ప్రమాదంలో పడ్డాయని ఆందోళన చెందుతున్నారు. అస్పష్టమైన, లేదంటే చిన్నచిన్న కారణాలకే విద్యార్థులను బహిష్కరించడం వల్ల ఆ కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడుతుంది.

కాగా, అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించేందుకు ఎదురుచూస్తున్న విదేశీ విద్యార్థులకు  తాత్కాలిక విరామం తర్వాత విద్యార్థి వీసాల మంజూరు ప్రక్రియను అమెరికా ప్రారంభించింది. కానీ, దరఖాస్తుదారులు స్క్రీనింగ్‌ సమయంలో తప్పనిసరిగా సోషల్‌ మీడియా అకౌంట్ల వివరాలు సమర్పించాలని వెల్లడించింది. ఈ మేరకు అమెరికా విదేేశాంగ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.

“వీసా కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను యూఎస్ కాన్సులర్ అధికారులు తనిఖీ చేస్తారు. అందుకోసం విద్యార్థులు తమ సోషల్ మీడియా ఖాతాలను ప్రైవేటు సెట్టింగ్స్ను మార్చుకుని పబ్లిక్గా అన్లాక్ చేయాల్సి ఉంటుంది. దీంతో మన దేశంలో వచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తిని పూర్తిగా పరిశీలించేందుకు వీలు లభిస్తుంది. అప్పుడే విద్యార్థులకు వీసా అనుమతి ఇవ్వాలా, వద్దా అనేది నిర్ణయిస” అని ఓ సీనియర్ అధికారి తెలిపారు.

ఈ ఏడాది మే చివరి వారం నుంచి విదేశీ విద్యార్థుల ఇంటర్వ్యూలను అమెరికా నిలిపివేసింది. అయితే, ఇది తాత్కాలికమేనని తెలిపింది. వీసా జారీ కోసం అవసరమైన సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించాలని అనుకుంటున్నట్లు అప్పుడు విదేశాంగ శాఖ తెలిపింది. అందుకుకోసమే అవసరమైన సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసే వరకు వీసాల బుకింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పేర్కొంది.