ఇరాన్ నుండి 10వేల మందికి పైగా భారతీయుల తరలింపు!

ఇరాన్ నుండి 10వేల మందికి పైగా భారతీయుల తరలింపు!
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్రమవుతున్న ఘర్షణల మధ్య 1500 మంది విద్యార్థులు సహా 10,000 మందికి పైగా భారతీయులు చిక్కుకుపోయిన ఇరాన్ నుండి భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున తన పౌరులను తరలించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. 100 మంది భారతీయులతో కూడిన మొదటి బ్యాచ్ అర్మేనియాలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఇది కష్టతరమైన,  అపూర్వమైన ఆపరేషన్‌కు నాంది పలికింది. 
 
చిక్కుకుపోయిన విద్యార్థులకు సురక్షితమైన మార్గాన్ని అందించాలని న్యూఢిల్లీ చేసిన అభ్యర్థనకు టెహ్రాన్ స్పందించిన తర్వాత తరలింపు ప్రయత్నం జరిగింది. ఘర్షణల కారణంగా దేశ వైమానిక ప్రాంతం మూసివేయడంతో అజర్‌బైజాన్, తుర్క్‌మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లలోకి ప్రవేశించడానికి భారతీయులు తమ భూ 
సరిహద్దులను ఉపయోగించడానికి ఇరాన్ అంగీకరించింది. 
 
టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం తన పౌరుల భద్రతను నిర్ధారించడానికి ప్రయత్నాలు చేస్తోంది. మిషన్ నిరంతరం భద్రతా పరిస్థితిని పర్యవీక్షిస్తూ భారతీయ విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది. “తాజ్రిష్‌లోని షాహిద్ బెహెష్టి యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, టర్కీ,అజర్‌బైజాన్‌లతో ఇరాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఉర్మియా యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లలో విద్యార్థుల తరలింపు త్వరలో జరుగుతుందని భావిస్తున్నారు” అని ఒక అధికారి తెలిపారు. 
 
ఇటీవలి సంవత్సరాలలో భారత ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద తరలింపు చర్యల్లో ఇది ఒకటి అని భావిస్తున్నారు, టెహ్రాన్, మషద్, కోమ్, జహెదాన్ వంటి వివిధ ఇరానియన్ నగరాల్లో వేలాది మంది పౌరులు చిక్కుకుపోయారు. ఇంతలో, అనేక మంది భారతీయ విద్యార్థులు పేలుళ్లతో మేల్కొని ప్రాణభయంతో ఉన్నారని, కొందరు సురక్షితంగా ఉండటానికి నేలమాళిగల్లో ఆశ్రయం పొందుతున్నారని నివేదించారు.
 
కాగా, గతవారం ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరిట దాడులు ప్రారంభించినప్పటి నుంచి రాజధాని టెహ్రాన్‌  సహా పలు కీలక ప్రాంతాలు, నగరాలపై ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌ భారీ నష్టాన్ని చవిచూస్తోంది.  ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌లో ఇప్పటి వరకూ 585 మంది ప్రాణాలు కోల్పోయినట్లు మానవ హక్కుల సంఘాలు తాజాగా తెలిపాయి. దాదాపు 1326 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. మృతుల్లో 239 మంది టెహ్రాన్‌ వాసులు కాగా, 126 మంది భద్రతా సిబ్బంది, ఉన్నత అధికారులు ఉన్నట్లు సమాచారం.

ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ నగర నడిబొడ్డున నివసిస్తున్న దాదాపు 3.30 లక్షల మందిని ఖాళీ చేయాలని ఇజ్రాయెలీ సైన్యం అంతకుముందు పిలుపునిచ్చింది. పశ్చిమాసియాలో అతి పెద్ద నగరాలలో ఒకటైన టెహ్రాన్‌లో దాదాపు కోటి మంది నివసిస్తున్నారు. ఇజ్రాయెల్‌ జనాభాకు ఇది దాదాపు సరిసమానం. 

ఇరాన్‌ అణు కేంద్రాలపై దాడులు చేసేందుకు తమకు ‘14వేల కిలోల బంకర్‌ బస్టర్‌’ బాంబులను ఇవ్వాలని అమెరికాను ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు కోరినట్టు సమాచారం. ఇరాన్‌ అణు కేంద్రాలను ఇజ్రాయెల్‌ టార్గెట్‌ చేయగా, ఫోర్డో అణు శుద్ధి కర్మాగారాన్ని మాత్ర ధ్వంసం చేయలేకపోయింది. పర్వతప్రాంతాల్లో భూగర్భంలో నిర్మించిన ఈ అణు కేంద్రాన్ని ధ్వంసం చేసేందుకు బంకర్‌ బస్టర్‌ను వాడాలని ఇజ్రాయెల్‌ భావిస్తున్నది. 

ఇటీవల ఖమేనీ ఎక్కడ దాక్కొన్నారో తమకు తెలుసని, . ప్రస్తుతానికి చంపాలనుకోవడం లేదని పేర్కొంటూ బేషరతుగా లొంగిపోవాలని లేదంటే పరిస్థితులు తీవ్రంగా మారుతాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇచ్చిన హెచ్చరికపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. అది జరిగిన కొన్ని గంటల తర్వాత “నమి పేరుతో యుద్ధం మొదలైంది. అలీ తన జుల్ఫికర్‌తో(కత్తి) కలిసి ఖైబర్‌కు వచ్చేశారు” అని ఖమేనీ పోస్ట్ చేశారు.

ఆ తర్వాత తాము బలంగా ప్రతిస్పందిస్తామని, ఎవరిపైనా దయ చూపేది లేదని రాసుకొచ్చారు. దీంతో యుద్ధం మరింత తీవ్రమయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి. అయితే 7వ శతాబ్దంలో యూదుల పట్టణమైన ఖైబర్‌పై షియా ఇస్లాం మొదటి ఇమామ్‌ యుద్ధం చేసి అందులో విజయం సాధించారు. ఆ నాటి ఘటనను గుర్తుచేస్తూ ఖమేనీ ఇప్పుడు పోస్ట్ పెట్టినట్లు సమాచారం. 

ఇజ్రాయెల్​ చేస్తున్న దాడుల్లో ఒక్క అమెరికన్ జోక్యం చేసుకున్నా అది పూర్తిస్థాయి యుద్ధానికి ఆజ్యం పోయడమే అవుతుందని ఓ ఇంగ్లీష్ ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్​ బఘేయి హెచ్చరించారు.

మరోవంక, ఇజ్రాయిల్‌పై బుధవారం తెల్లవారుజామున హైపర్‌ సోనిక్‌ క్షిపణులను ప్రయోగించినట్లు ఇరాన్‌ తెలిపింది. హైపర్‌ సోనిక్‌ ఫతా -1 క్షిపణులను ప్రయోగించి ఆపరేషన్‌ హానెస్ట్‌ ప్రామిస్‌ 3 11వ దశను నిర్వహించామని ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ రాష్ట్ర టెలివిజన్‌లో ప్రసారం చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. హైపర్‌ సోనిక్‌ క్షిపణులు ధ్వని వేగం కంటే ఐదు రెట్లు అధిక వేగంతో ప్రయాణించగలవు. వీటిని ట్రాక్‌ చేయడం, అడ్డుకోవడం కష్టతరం.