కెనడా- భారత్ మధ్య దౌత్యవేత్తలు పునర్ నియామకం

కెనడా- భారత్ మధ్య దౌత్యవేత్తలు పునర్ నియామకం
నిజ్జర్‌ హత్యతో దెబ్బతిన్న భారత్‌-కెనడా మధ్య సంబంధాలు మళ్లీ బలపడుతున్నాయి. గత రెండేళ్లుగా ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇటీవలే జరిగిన కెనడా ఎన్నికల్లో అధికార మార్పు జరగడం.. తాజాగా ప్రధాని మోదీ కెనడా పర్యటనతో మొత్తం మారిపోయింది. ట్రూడో పాలనలో తెగిపోయిన సంబంధాలు ఇప్పుడు మళ్లీ బలపడుతున్నాయి.
రెండు దేశాల మధ్య పూర్తి దౌత్య సేవలను తిరిగి ప్రారంభించడానికి ఇరు దేశాలూ తాజాగా అంగీకారానికి వచ్చాయి.
కెనడాలో జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని మార్క్‌ కార్నీతో మోదీ సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతానికి సంబంధించిన కీలక అంశాలపై ఇరువురూ చర్చించారు.  ఈ సందర్భంగా దౌత్యవేతలను తిరిగి నియమించడంపై ఏకాభిప్రాయం కుదిరింది. ఇరుదేశాల పౌరులు, వ్యాపారాలకు సాధారణ సేవలను పునరుద్ధరించే లక్ష్యంతో కొత్త హై కమిషనర్లను నియమించడానికి అంగీకరించినట్లు కెనడా ప్రధాని మార్క్ కార్నీ తెలిపారు. ఈ సమావేశం ముఖ్యమైనదని భావిస్తున్నానని చెప్పారు.
 
వివిధ దేశాధినేతలతో భేటీ అనంతరం క్రోషియాకు బయలుదేరుతూ కెనడా పర్యటన విజయవంతంగా ముగిసిందని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు ప్రధాని మోదీ. జీ 7 సదస్సును నిర్వహించిన కెనడా ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు ధన్యావాదాలు తెలిపారు. అంతర్జాతీయ సమస్యలపై ఫలప్రదమైన చర్చలు జరిగాయని వివరించారు. ప్రపంచ శాంతికి భారత్ కట్టుబడి ఉందని గుర్తు చేశారు.
 
పాక్‌తో కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా పాత్రపై ప్రధాని తొలిసారి స్పందిస్తూమధ్యవర్తిత్వాన్ని భారత్‌ ఎన్నటికీ అంగీకరించదని స్పష్టం చేశారు. భారత్‌-పాక్‌ మధ్య ఒప్పందం విషయంలో అమెరికా ప్రమేయం లేదని ట్రంప్‌తో ప్రధాని తేల్చిచెప్పారని కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ  వెల్లడించారు.
అర్ధాంతరంగా ట్రంప్ కెనడా నుండి వెళ్లిపోవడంతో ఆయనతో 35 నిముషాలసేపు టెలిఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు.
 
అంతకుముందు కెనడా, దక్షిణ కొరియా, మెక్సికో, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇటలీ, జర్మనీ దేశాధినేతలతో భేటీ అయ్యారు. ఆయా నేతలతో ఉగ్రవాదంతో పాటు ఆర్థిక, వాణిజ్య, రక్షణ పరమైన ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించినట్టు ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ తెలిపారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్‌తో జరిగిన సమావేశంలో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా చర్చలు జరిగినట్లు చెప్పారు. 
 
వాణిజ్యం, ఆర్థిక, గ్రీన్ హైడ్రోజన్, షిప్‌ బిల్డింగ్, సంస్కృతి వంటి అంశాల్లో సహకారంపై చర్చించినట్లు పోస్ట్‌ చేశారు. యూరోపియన్ యూనియర్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డర్ లియన్ను కలిశారు ప్రధాని మోదీ.  మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్‌తో తొలిసారి భేటీ అయిన ప్రధాని మోదీ, ప్రాంతీయ సమస్యలు, వ్యవసాయం, సెమీకండక్టర్ల తయారీ, కీలక ఖనిజాలు, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో ఇరు దేశాల సంబంధాలపై చర్చించారు. 
 
ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్‌తో భేటీని “మిత్రుడితో జరిగిన గొప్ప సమావేశం”గా ప్రధాని మోదీ అభివర్ణించారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసాను కలిసిన ఉన్న ఫొటోను ఎక్స్‌లో షేర్ చేసిన మోదీ, రామఫోసాతో సమావేశమవడం సంతోషంగా ఉందన్నారు. జర్మనీ ఛాన్స్‌లర్‌తో జరిగిన భేటీలో రక్షణ, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, ఉగ్రవాదానికి అందుతున్న నిధలను అరికట్టడంపై చర్చించినట్టు తెలిపారు.