సింధూనదిమిగులు జలాలు తరలించాలని భారత్ యత్నం

సింధూనదిమిగులు జలాలు తరలించాలని భారత్ యత్నం
పూర్తి స్థాయిలో సింధూనదీలోని తన వాటా జలాల వినియోగానికి భారత్‌ భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. జమ్మూకశ్మీర్‌ గుండా పాక్‌కు పోతున్న మిగులు జలాలను 113 కిమీ పొడవైన కాలువ ద్వారా పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌లకు మళ్లించాలని యోచిస్తోంది. కాలువ నిర్మాణ సాధ్యాసాధ్యాలపై కేంద్రం లోతుగా అధ్యయనం చేస్తోందని ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. 
పాక్‌కు సింధూజలాలను నిలిపివేస్తున్నట్టు పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సింధూ నదీజలాల మళ్లింపు ప్రణాళికను మోదీ ప్రభుత్వం సిద్ధం చేస్తున్నదని ఆ కథనం పేర్కొంది. సింధూ పరివాహకంలోని చినాబ్‌ను రావి-బియాస్‌-సట్లేజ్‌తో ఈ కాలువ అనుసంధానిస్తుందని శనివారం బీజేపీ శిక్షణా శిబిరంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సూచనప్రాయంగా వెల్లడించారు.

జమ్మూకశ్మీర్‌ నుంచి పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌ల్లో గల కాలువలను కలుపుకుంటూ కొత్త కాలువ నిర్మాణం చేపడతారు. అంతిమంగా రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌ కాలువ వ్యవస్థతో అనుసంధానిస్తారు. దీనికోసం బ్యారేజ్‌లు, టన్నెళ్లు నిర్మిస్తారు. రణబీర్‌ కాలువను డబుల్‌ చేస్తూ 60 కిమీ నుంచి 120 కిమీకు విస్తరిస్తారు.  కథువా జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఉజ్‌ బహుళార్థ సాధక ప్రాజెక్టును పునరుద్ధరిస్తారు.

ఉజ్‌కు దిగువన రెండో రావి-బియాస్‌ లింక్‌ను గతంలో తలపెట్టారు. పాకిస్థాన్‌లోకి ప్రవహించే మిగులు రావి జలాలను ఆపటం అప్పట్లో దీని లక్ష్యం. దీనిని కూడా కాలువ నెట్‌వర్క్‌లో అంతర్భాగం చేయాలని తాజాగా యోచిస్తున్నారు. దీనికోసం ఒక బ్యారేజ్‌, టన్నెల్‌ను నిర్మించి.. బియాస్‌ నదీ బేసిన్‌కు జలాలను మళ్లిస్తారు. వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో పాకల్‌ దల్‌ ప్రాజెక్టును తలపెట్టింది. రెటిల్‌ (850మెగావాట్లు), కిరూ (624 మెగావాట్లు) ఖ్వార్‌ (540 మెగావాట్లు) ప్రాజెక్టులను చేపడుతోందని ఆ కథనం తెలిపింది.