సెప్టెంబ‌ర్ 30 నుంచి మ‌హిళ‌ల వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్

సెప్టెంబ‌ర్ 30 నుంచి మ‌హిళ‌ల వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్

ప్రపంచ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ (డబ్ల్యుటిసి) ఫైన‌ల్ ముగియ‌డ‌మే ఆల‌స్యం మ‌రో మెగా టోర్నీ అభిమానుల‌ను అల‌రించ‌నుంది. అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సోమ‌వారం మ‌హిళ‌ల వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది. భార‌త్, శ్రీ‌లంక సంయుక్తంగా ఆతిథ్య‌మిస్తున్న ఈ మెగా టోర్నీ సెప్టెంబ‌ర్ 30న షురూ కానుంది. రౌండ్ రాబిన్ ప‌ద్ధ‌తిలో జ‌రిగే ఈ టోర్నీ ఆరంభం రోజే టీమిండియా బెంగ‌ళూరులో శ్రీలంక‌తో త‌ల‌ప‌డ‌నుంది.

టీమిండియా, పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబ‌ర్ 5న జ‌రుగ‌నుంది. ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడి, ఆప‌రేష‌న్ సిందూర్  త‌ద‌నంత‌ర ప‌రిణామాల నేప‌థ్యంలో పాక్ మ్యాచ్‌ల‌కు లంక వేదిక కానుందని ఐసీసీ పేర్కొంది. కొలంబోలో ఏకంగా 11 లీగ్ మ్యాచ్‌ల‌కు ఐసీసీ ఆమోదం తెలిపింది. వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియ‌న్‌గా అడుగుపెట్ట‌నుంది.  సంయుక్తంగా ఆతిథ్య‌మిస్తున్న భార‌త్, శ్రీ‌లంక‌లు ఫేవ‌రెట్లుగా బ‌రిలోకి దిగ‌నున్నాయి.

సెప్టెంబ‌ర్ 30 లంక‌, టీమిండియా పోరుతో మెగా టోర్నీ షురూ కానుంది. అనంత‌రం అక్టోబర్ 1న‌ న్యూజిలాండ్‌తో ఆసీస్ త‌ల‌ప‌డ‌నుంది. మొత్తంగా కొలంబోలో 11 లీగ్ మ్యాచ్‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. అక్టోబ‌ర్ 29న కొలంబో లేదా బెంగ‌ళూరులో తొలి సెమీ ఫైన‌ల్ జ‌రుగ‌నుండ‌గా, అక్టోబ‌ర్ 30న బెంగ‌ళూరులో రెండో సెమీ ఫైన‌ల్ మ్యాచ్ ఉండ‌నుంది. టైటిల్ విజేత‌ను నిర్ణ‌యించే ఫైన‌ల్ పోరు నవంబ‌ర్ 2న జ‌రుగ‌నుంది. ఈ మ్యాచ్‌కు బెంగ‌ళూరు లేదా కొలంబో వేదిక కానుంద‌ని ఐసీసీ వెల్ల‌డించింది. భారత జట్టు పాల్గొనే ఆటలు:

సెప్టెంబర్‌ 30: భారత్‌-శ్రీలంక – బెంగళూరు

అక్టోబర్‌ 5: భారత్‌-పాకిస్థాన్‌ – కొలంబో

అక్టోబర్‌ 9: భారత్‌-దక్షిణాఫ్రికా – విశాఖపట్నం

అక్టోబర్‌ 12: భారత్‌-ఆస్ట్రేలియా – విశాఖపట్నం

అక్టోబర్‌ 19: భారత్‌-ఇంగ్లాండ్‌ – ఇండోర్‌

అక్టోబర్‌ 23: భారత్‌-న్యూజిలాండ్‌ – గౌహతి

అక్టోబర్‌ 26: భారత్‌-బంగ్లాదేశ్‌ – బెంగళూరు