కూలిన విమాన నిర్వహణలో సంబంధం లేదన్న టర్కీ

కూలిన విమాన నిర్వహణలో సంబంధం లేదన్న టర్కీ
* గుజరాత్ మాజీ సీఎం మృతదేహం గుర్తింపు
 
అహ్మదాబాద్‌లో జూన్‌ 12న కూలిన ఎయిర్‌ ఇండియా డ్రీమ్‌లైనర్‌ విమానం నిర్వహణలో తమ సంస్థకు సంబంధం లేదని టర్కీ తెలిపింది. ఈ అంశంపై వస్తున్న ఆరోపణలను ఆ దేశం ఖండించింది. టేకాఫ్ సమయంలో కూలిన ఎయిర్‌ ఇండియాకు చెందిన ‘బోయింగ్ 787-8 విమానం నిర్వహణను టర్కిష్ టెక్నిక్ సంస్థ చేపట్టినట్లుగా వస్తున్న ఆరోపణలు అబద్ధమని తెలిపింది. 
 
టర్కీ, భారత్‌ మధ్య సంబంధాలపై ప్రజల్లో దురాభిప్రాయం కలిగించే తప్పుడు సమాచారమని ఆరోపించింది.  కాగా, ఎయిర్ ఇండియా, టర్కిష్ టెక్నిక్ మధ్య 2024-2025లో జరిగిన ఒప్పందాల ప్రకారం బీ777 వైడ్ బాడీ విమానాలకు ప్రత్యేకంగా నిర్వహణ సేవలు అందిస్తున్నట్లు టర్కీ ప్రభుత్వం తెలిపింది.  అయితే ప్రమాదానికి గురైన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ ఈ ఒప్పందం పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. ‘ఈ రోజు వరకు టర్కిష్ టెక్నిక్ ఈ రకమైన ఏ ఎయిర్ ఇండియా విమానానికి నిర్వహణ బాధ్యత నిర్వహించలేదు’ అని పేర్కొంది.

మరోవైపు కూలిన ఎయిర్‌ ఇండియా విమానానికి ఏ కంపెనీ చివరిగా సర్వీస్‌ చేసిందో అన్నది తమకు తెలుసని టర్కీ తెలిపింది. అయితే విమాన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో మరిన్ని ఊహాగానాలను నివారించడానికి ఆ సంస్థ పేరును వెల్లడించడంలేదని టర్కీ చెప్పింది. విషాదకరమైన విమాన ప్రమాదంపై భారత ప్రజల దుఃఖాన్ని టర్కీ ప్రజలు హృదయపూర్వకంగా పంచుకుంటున్నారని పేర్కొంది.

కాగా, విమాన ప్రమాదంలో మృతి చెందిన గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతదేహాన్ని గుర్తించినట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి ఆదివారం ప్రకటించారు. ప్రమాదం జరిగిన మూడు రోజుల అనంతరం ఆయన   మృతదేహాన్ని  గుర్తించినట్లు గుజరాత్‌ హోంమంత్రి హర్ష్‌ సింఘ్వీ తెలిపారు.  రూపానీ డిఎన్‌ఎ కుటుంబసభ్యుల డిఎన్‌ఎతో సరిపోలిందని పేర్కొన్నారు.

రూపాని భౌతికకాయాన్ని వారి కుటుంబసభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. ఇప్పటివరకు 32 మంది  మృతుల  డిఎన్‌ఎలను పరీక్షించామని బిజె వైద్య కళాశాల సీనియర్‌ వైద్యులు వెల్లడించారు. 14  మృతదేహాలను  వారి కుటుంబ సభ్యులకు అప్పగించామని చెప్పారు. ప్రమాద తీవ్రత ధాటికి మృతదేహాలన్నీ పూర్తిగా కాలిపోవడంతో డిఎన్‌ఎ పరీక్షలు నిర్వహిస్తున్నామని,  ఒక్కో పరీక్షకు ఎక్కువ సమయం పడుతుండడంతో  మృతదేహాల గుర్తింపు ఆలస్యం అవుతుందని తెలిపారు.
 
ఇలా ఉండగా, విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 279కి చేరింది. 241 ప్రయాణికులు, 38 మంది బిజె మెడికల్ కళాశాల ప్రాంగణంలో మృతి చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం కాలిన గాయాలతో అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు.