దేశవ్యాప్తంగా రెండు దఫాల్లో జమిలి ఎన్నికల ప్రక్రియ

దేశవ్యాప్తంగా రెండు దఫాల్లో జమిలి ఎన్నికల ప్రక్రియ
* ఈ సారి ఒకేసారి 2029లో లోక్ సభతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు
 
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఈసారి లోక్‌సభ ఎన్నికలతో కలిసి జమిలిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ విధానంలో భాగంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను 2029లో లోక్‌సభ ఎన్నికలతో పాటు నిర్వహించాలనే యోచనలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉంది. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ విధానాన్ని దేశవ్యాప్తంగా ఒకే దశలో కాకుండా, రెండు దశల్లో కొలిక్కి తేవాలని కేంద్రం భావిస్తోంది. 
 
అంటే దేశంలోని దాదాపు సగం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను 2029 లోక్‌సభ ఎన్నికలతోపాటు నిర్వహించాలని, అనంతరం 2034లో జరిగే సార్వత్రిక ఎన్నికల నాటికి మిగతా సగం రాష్ట్రాలకు కూడా కలిపి నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది. లోక్‌సభ ఎన్నికలతోపాటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలనే దిశగా అడుగులు వేస్తున్న మోదీ సర్కారు ఈ పనిని రెండు దఫాలుగా సాకారం చేయడం సులభతరం అవుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ఇందులో భాగంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను తొలిదఫా జమిలిగా నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు రాష్ట్ర అసెంబ్లీకి చాలా దఫాలు పార్లమెంటుతో కలిపే ఎన్నికలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక జరిగిన 2014 ఎన్నికలు కూడా జమిలిగానే నిర్వహించారు. అయితే ఆ తర్వాత 2018లో నాటి కేసీఆర్‌ ప్రభుత్వం లోక్‌సభతో కాకుండా సుమారు ఐదు నెలల ముందుగానే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లింది. 2023లోనూ అదే కొనసాగింది.

ఒకే దేశం-ఒకే ఎన్నిక వ్యవహారం ఒకేసారి తేలేది కాదన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు గత ఏడాదే జరగగా, వాటితోపాటు కేవలం నాలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కింల అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే జరిగాయి. మిగిలిన రాష్ట్రాలన్నింటిలోనూ ఎన్నికలు కొంత ముందు, లేదంటే కొంత వెనక జరిగాయి. కొన్ని రాష్ట్రాల్లోనైతే ఏకంగా మూడేళ్ల ముందు కూడా జరిగాయి. 

బిహార్‌, అసోం, గోవా, గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌, పాండిచ్చేరి, పంజాబ్‌, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల శాసనసభలకు 2021-2022లో ఎన్నికలు జరిగాయి. ఇక ఢిల్లీలో ఈ ఏడాదే ఎన్నికలు జరగగా, బిహార్‌లో వచ్చే సెప్టెంబరు-అక్టోబరులో జరగనున్నాయి. అయితే 2024 పార్లమెంటు ఎన్నికలకు సుమారు ఏడాది ముందుగానీ, ఏడాది తర్వాతగానీ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాలను ఒక క్యాటగిరీగా తీసుకోవాలని కేంద్రం యోచిస్తోంది. 

అంటే 2028, 2029లలో ఎన్నికలు జరగాల్సి ఉన్న రాష్ట్రాలను తొలివిడతలో పరిగణనలోకి తీసుకోనున్నారు. 2028లో తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్‌, కర్ణాటక, ఛత్తీ్‌సగఢ్‌, రాజస్థాన్‌, మేఘాలయ, నాగాలాండ్‌, త్రిపుర, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. 2029లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం, హరియాణ, జార్ఖండ్‌, మహారాష్ట్ర ఉన్నాయి. ఈ 16 రాష్ట్రాలకు 2029 పార్లమెంటు ఎన్నికలతో కలిపి జమిలి ఎన్నికలు నిర్వహించనున్నారు. 

మిగతా 15 రాష్ట్రాల్లో ఏవైనా ఈ పరిధిలోకి వచ్చే అవకాశాలున్నాయా? అన్నది కూడా పరిశీలిస్తారు. అలా లేని వాటన్నింటినీ 2034 నాటికి ఒకే దేశం-ఒకే ఎన్నిక పరిధిలోకి తేవాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఒకే దేశం-ఒకే ఎన్నికకు సంబంధించి 129వ రాజ్యాంగ సవరణ బిల్లును గత ఏడాది డిసెంబరులో పార్లమెంటులో ప్రవేశపెట్టారు. పార్లమెంటు-అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడానికి సంబందించిన అంశాలను ఇందులో పొందుపరిచారు. 

అంతకుముందు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ.. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలను కూడా ఒకేసారి నిర్వహించాలని సిఫార్సు చేసింది. పార్లమెంటు-అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన 100 రోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. అయితే ప్రస్తుతానికి పార్లమెంటు-అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో అనే అంశంపైనే బిల్లును రూపొందించారు. 

తొలుత ఈ అంకాన్ని పూర్తిచేస్తే ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఏకకాలంలో అన్న అంకానికి తెరతీసే అవకాశాలున్నాయి. మరోవైపు 129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై నియమించిన జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) కూడా ఆ అంశంపై అభిప్రాయ సేకరణకు అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తోంది. తొలుత ఈ కమిటీలో 31 మందిని నియమించగా, ఆ తర్వాత కొన్ని చిన్న పార్టీలు తమకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలని కోరాయి. ఇందుకు కేంద్రం అంగీకరించడంతో ఆ సంఖ్య 39కి పెరిగింది.