
షార్‌లో బాంబులు పెట్టారు, తీవ్రవాదులు ఉన్నారంటూ చెన్నై కమాండ్ కంట్రోల్ రూంకు గుర్తుతెలియని వ్యక్తులు కాల్ చేశారు. అయితే ఇది ఆకతాయిల పనా, లేకపోతే నిజంగానే ఉందా అనేది అర్ధంకాని పరిస్థితి. దీంతో బలగాలు అప్రమత్తమై తెల్లవారుజాము నుంచి శ్రీహరికోటలో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. సీఐఎస్ఎఫ్ బలగాలు బృందాలుగా ఏర్పడి షార్ చుట్టుపక్కల కూంబింగ్ చేపట్టారు.
సముద్ర మార్గాల్లో కూడా తీరప్రాంత రక్షణ దళాల తనిఖీలు ముమ్మరం చేశారు. షార్ మొదటి గేటు, షార్ ఉద్యోగుల కాలనీలో తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది. నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో తనిఖీలు జరిగినట్లు సమాచారం. షార్ చుట్టూ నీరు ఉంటుంది. షార్‌లోకి వెళ్లేందుకు కేవలం ఒక మార్గం మాత్రమే ఉంది. షార్‌లో రెండు వేల మంది వరకు సీఐఎస్‌ఎఫ్ జవాన్లు ఉంటారు. వారంతా కూడా అడవులను జల్లెడపడుతున్నారు.
ప్రపంచ స్థాయిలో అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ ఎంతో వేగంగా దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఏదైనా ప్రమాదం జరుగుతుందా అని భావిస్తూ పెద్ద ఎత్తున సీఐఎస్‌ఎఫ్ జవాన్లు అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. కంట్రోల్ రూంలు, అక్కడ ఉండే పలు కాలనీలను కూడా తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు సముద్రమార్గం ద్వారా ఎవరైనా చొరబడ్డారా అనే అనుమానంతో అక్కడ కూడా ప్రత్యేకమైన బృందాలు తనిఖీలు చేస్తున్నాయి.
తీవ్రవాదులు ఉన్నారనే కాల్ రావడంతో షార్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిజంగా తీవ్రవాదులు చొరబడ్డారా లేదా అనే దానిపై విస్తృతంగా సోదాలు జరుగుతున్నాయి. భద్రతా బలగాలు ఎవరినీ కూడా లోపలికి పంపించకుండా మెయిన్ గేటు వద్దే క్షుణ్ణంగా సోదాలు చేస్తున్నారు. అయితే షార్‌లోకి తీవ్రవాదులు చొరబడే అవకాశాలు లేవు. షార్ చుట్టూ కూడా మత్స్యకారుల గ్రామాలు, దీవులు ఉన్నాయి.
ఈ గ్రామ ప్రజలు చేపల వేటతో జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు వస్తే వెంటనే షార్‌లోని సీఐఎస్‌ఎఫ్ జవాన్లు, స్థానిక పోలీసులకు సమాచారం ఇస్తుంటారు. ఈ క్రమంలో ఇటీవల కాలంలో ఎవరైనా తెలియని వ్యక్తులు వచ్చారా అనేదానిపై మత్స్యకార ప్రజలను కూడా పోలీసులు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో షార్ చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు.
More Stories
భారత్కు నష్టం కలిగించారనే ఒక్క ఫొటో చూపించగలరా?
కాకినాడ మెడికల్ కాలేజీలో లైంగిక వేధింపులు
టిటిడిలో వేయి మందికి పైగా అన్యమతస్థులు