మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ఈడీ సమన్లు

మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ఈడీ సమన్లు
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​ (ఈడీ) సమన్లు జారీ చేసింది. యూకేకు చెందిన ఆయుధాల కన్సల్టెంట్ సంజయ్ భండారీ అక్రమ నగదు చలామణి (మనీ లాండరింగ్) కేసులో తన వాంగ్మూలాన్ని రికార్డ్ చేయడానికి జూన్​ 17న ఈడీ ముందు రాబర్ట్ వాద్రా హాజరు కావాలని కోరినట్లు సదరు అధికారిక వర్గాలు తెలిపాయి.

వాస్తవానికి జూన్​ 10నే రాబర్ట్ వాద్రా ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ 56 ఏళ్ల వాద్రా తనకు జూన్​ 9న ఫ్లూ లాంటి లక్షణాలు ఉన్నాయని, ప్రోటోకాల్ ప్రకారం కరోనా టెస్ట్ చేయించుకున్నానని చెప్పి, గైర్హాజరు అయ్యారు. అయితే వాద్రాకు ఈడీ సమన్లు తప్పించుకునే ఉద్దేశం లేదని, ఈ నెల చివర్లో తన విదేశీ ప్రయాణానికి ముందుగానీ లేదా తరువాత ఎప్పుడైనా కానీ ఈడీ ముందు హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తరఫు న్యాయవాది అప్పట్లో చెప్పారు.

అయితే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్​ (పీఎంఎల్​ఏ) కింద తన వాంగ్మూలాన్ని రికార్డ్ చేయడానికి, తర్వాత ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేయడానికి రాబర్ట్ వాద్రాకు ఈడీ తాజా సమన్లు​ జారీ చేసినట్లు తెలుస్తోంది. రాబర్ట్ వాద్రాను ఈడీ 3 మనీ లాండరింగ్ కేసుల్లో విచారణ చేస్తోంది. మొదటగా, హరియాణాలో 2008లో జరిగిన ఓ భూ ఒప్పందంలో అక్రమాలు జరిగాయంటూ మనీలాండరింగ్ కేసు నమోదు అయ్యింది. ఈ కేసు విషయంగా ఈడీ రాబర్ట్ వాద్రాను 3 రోజులపాటు ప్రశ్నించింది.

రెండో కేసులో, రాజస్థాన్​లోని బికనీర్​లో జరిగిన ఓ భూ ఒప్పందంలో ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ మనీలాండరింగ్ కేసులోనూ రాబర్ట్ వాద్రాపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. మూడో కేసులో 2016లో ఢిల్లీలో ఉన్న సంజయ్​ భండారీ (63)పై ఆదాయపు పన్ను శాఖ రైడింగ్ చేసింది. ఇది జరిగిన వెంటనే అతను లండన్ పారిపోయాడు. అతనిని తిరిగి భారత్​కు తీసుకువచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరుకూ ఈ నెల ప్రారంభంలో బ్రిటన్ సుప్రీంకోర్ట్​లో భారత్ ప్రభుత్వం అప్పీల్ చేసింది. అయితే దానిని యూకే కోర్ట్ తిరస్కరించింది. దీనితో భండారీని మన దేశానికి తీసుకువచ్చే అవకాశాలు దాదాపుగా లేకుండా పోయాయి.

2009లో లండన్​లోని 12, బ్రయాన్​స్టన్​ స్క్వేర్​ ఇండిని భండారీ కొనుగోలు చేశాడు. అయితే దానిని రెనోవేషన్ చేయమని ఆదేశిస్తూ రాబర్ట్ వాద్రా నిధులు అందించినట్లు ఈడీ 2023లో ఛార్జ్ షీట్​ దాఖలు చేసింది. అయితే తనకు ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగా గానీ లండన్​లో ఎలాంటి ఆస్తులు లేవని రాబర్ట్ వాద్రా అంటున్నారు. తనపై ‘రాజకీయ కక్ష’లతోనే ఇలా ఈడీ కేసులు పెట్టి ‘వెంటాడి, వేధిస్తున్నారు’ అని అన్నారు.