ఇరాన్ పై దాడుల్లో ‘షాంఘై సహకార సంస్థ’కు భారత్ దూరం  

ఇరాన్ పై దాడుల్లో ‘షాంఘై సహకార సంస్థ’కు భారత్ దూరం  
ఇజ్రాయెల్ – ఇరాన్ సైనిక ఘర్షణపై ‘షాంఘై సహకార సంస్థ’ (ఎస్‌సీఓ) శనివారం జారీచేసిన ప్రకటనతో తమకు సంబంధం లేదని భారత్ స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై తమ వైఖరి ఏమిటో ‘షాంఘై సహకార సంస్థ’ సభ్యదేశాలకు ఇప్పటికే తెలియపర్చామని వెల్లడించింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు చర్చలు, దౌత్యమార్గాలను ఉపయోగించుకోవాలి అనేదే తమ అభిప్రాయమని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

“ఇరాన్ – ఇజ్రాయెల్ ఉద్రిక్తతలపై షాంఘై సహకార సంస్థ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఇదే అంశంపై భారత్ సైతం తన వైఖరిని జూన్ 13న వ్యక్తపరిచింది. మా వైఖరికి మేం కట్టుబడి ఉంటాం. చర్చలు, దౌత్యమార్గాలను వాడుకొని ఇరాన్ – ఇజ్రాయెల్ ఉద్రిక్తతలను తగ్గించాలనేది మా విన్నపం. ఈ దిశగానే అంతర్జాతీయ సమాజం ప్రయత్నాలు ఉండాలని మేం కోరుతున్నాం” అని భారత్ స్పష్టం చేసింది.

“ఈ అంశంపై శుక్రవారం రోజు(జూన్ 13న) ఇరాన్ విదేశాంగ మంత్రితో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడారు. ఇటీవలే చోటుచేసుకున్న పరిణామాలపై అంతర్జాతీయ సమాజం తరఫున ఆందోళన వెలిబుచ్చారు. అందుకే దీనిపై ‘షాంఘై సహకార సంస్థ’ విడుదల చేసిన ప్రకటనలో భాగం కాకూడదని నిర్ణయించాం” అని భారత్ వివరించింది. ఇరాన్ – ఇజ్రాయెల్ ఉద్రిక్తతలపై శనివారం రోజు ‘షాంఘై సహకార సంస్థ’ (ఎస్‌సీఓ) విడుదల చేసిన ప్రకటనలో పలు కీలక అంశాల ప్రస్తావన ఉంది.

జూన్ 13న ఇరాన్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడులను ఎస్‌సీఓ ఖండించింది. ఇజ్రాయెల్ తీరు వల్ల పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగే ముప్పు ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేసింది. “జనావాసాలు, ఇంధన ఉత్పత్తి కేంద్రాలు, రవాణాపరమైన మౌలిక వసతులపై ఇజ్రాయెల్ దాడులు చేయడం వల్ల ప్రాణనష్టం జరిగింది. ఇలాంటి దాడులకు పాల్పడటం అనేది అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్యసమితి ఛార్టర్‌‌లోని నిబంధనలకు వ్యతిరేకం” అని ఎస్‌సీఓ పేర్కొంది.

“ఇరాన్ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా, ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతకు నష్టం చేకూర్చేలా ఇజ్రాయెల్ చర్యలు ఉన్నాయి. దీని వల్ల ప్రపంచశాంతి, సుస్థిరతలు ముప్పులో పడతాయి” అని ఎస్‌సీఓ అభిప్రాయపడింది. “ఎస్‌సీఓలో ఇరాన్ ఒక సభ్యదేశం. ఇరాన్ అణు కార్యక్రమంపై అభ్యంతరాలుంటే, శాంతియుత, రాజకీయ, దౌత్య మార్గాల్లో పరిష్కారాన్ని వెతకాలి. ఎస్‌సీఓ సభ్యదేశాలు ఐరాస, ఎస్‌సీఓ ఛార్టర్‌‌లకు కట్టుబడి నడుచుకుంటాయి. మా సభ్యదేశాలపై చట్టవ్యతిరేక చర్యలు తీసుకుంటే అంగీకరించం” అని ఎస్‌సీఓ తేల్చి చెప్పింది.