
కాగా, బోయింగ్ 787 విమానాల అదనపు భద్రతా తనిఖీల వల్ల, ముఖ్యంగా సుదూర అంతర్జాతీయ మార్గాల్లోని విమాన ప్రయాణాలు ఆలస్యం కావచ్చని ఎయిర్ ఇండియా తెలిపింది. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరే ముందు ప్రయాణీకులు తమ విమాన షెడ్యూల్‌ను చెక్ చేసుకోవాలని సూచించింది. ఈ భద్రతా తనిఖీల వల్ల కలిగే ఆలస్యం లేదా రద్దు వల్ల ప్రభావితమైన కస్టమర్లకు డబ్బు వాపసు లేదా ఉచిత రీషెడ్యూలింగ్‌ను ఎయిర్‌లైన్ అందిస్తుందని వెల్లడించింది.
మరోవైపు గురువారం అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై డీజీసీఏ స్పందించింది. జెనెక్స్ ఇంజిన్‌లతో కూడిన ఎయిర్ ఇండియాలోని బోయింగ్ 787-8, 787-9 విమానాల భద్రతను పూర్తిగా తనిఖీ చేయాలని ఆదేశించింది. ఇంధన వ్యవస్థలు, క్యాబిన్ ఎయిర్ కంప్రెషర్‌లు, హైడ్రాలిక్ సిస్టమ్‌లు, ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్‌ల తనిఖీలు, ఇంజిన్ సంబంధిత పరీక్షలు వంటి ప్రమాద నివారణ నిర్వాహణ చర్యలు చేపట్టాలని పేర్కొంది.
జూన్ 15 నుంచి ఈ తనిఖీలు చేపట్టి ఆ నివేదికలను డీజీసీఏకు సమర్పించాలని ఆదేశించింది. అహ్మదాబాద్‌లో కూలిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి దారి తీసిన కారణాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించింది.మరోవంక, గురువారం కూలిన ఎయిర్ ఇండియా విమానంలో ప్రమాదానికి ముందు ఎలాంటి సమస్యలు లేవని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఆ విమానం పారిస్ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ మధ్య ప్రయాణించినట్లు పేర్కొంది. దానితో ఆ విమాన ప్రమాదంకు దారితీసిన పరిస్థితులు ఇంకా అంతుబట్టడం లేదు. లండన్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మెడికల్ హాస్టల్ భవనంపైకి కూలిపోయిందని పౌర విమానయాన కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా తెలిపారు.
650 అడుగుల ఎత్తుకు చేరుకున్న తర్వాత విమానం ఎత్తు తగ్గడం ప్రారంభమైందని చెప్పారు. జూన్ 12న మధ్యాహ్నం 1:39 గంటలకు పైలట్ ఏటీసీకి మేడే కాల్ చేశారని వివరించారు. ‘టేకాఫ్ అయిన సరిగ్గా ఒక నిమిషం తర్వాత విమానాశ్రయం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేఘని నగర్‌లో విమానం కూలిపోయింది’ అని తెలిపారు. విమానంలోని ప్రయాణికులు, సిబ్బందితో సహా 241 మందితోపాటు ప్రమాదం జరిగిన ఆ ప్రాంతంలోని పలువురితో సహా సుమారు 270 మంది ఈ ప్రమాదంలో మరణించారు.
More Stories
భారత్కు నష్టం కలిగించారనే ఒక్క ఫొటో చూపించగలరా?
1977లో ఓటమి భయంతో ఆర్ఎస్ఎస్ చెంతకు ఇందిరా గాంధీ!
వామపక్ష తీవ్రవాదంపై మహారాష్ట్ర కఠిన బిల్!