అహ్మదాబాద్‌లో కుప్పకూలిన విమానం… 242 మంది ప్రయాణికులు

అహ్మదాబాద్‌లో  కుప్పకూలిన విమానం… 242 మంది ప్రయాణికులు
 
గుజ‌రాత్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. అహ్మదాబాద్‌లో విమానం కుప్పకూలిపోయింది. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టు నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిర్‌ ఇండియాకు చెందిన ఫ్లయిట్‌ నెంబర్‌ ఏఐ-171 విమానం మేఘానిలో కుప్పకూలిపోయింది. తాజా సమాచారం ప్ర‌కారం విమాన ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు 40 మంది మృతిచెందిన‌ట్లు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.
 
లండ‌న్‌కు బయ‌లుదేరిన విమానానికి చెందిన ఫ్ల‌యిట్‌రేడార్ డేటా కూడా రిలీజైంది. ఫ్ల‌యిట్ రేడార్24 డేటా ప్ర‌కారం విమానం చివ‌రిసారి 625 అడుగుల ఆల్టిట్యూడ్‌లో డేటాకు చిక్కిన‌ట్లు చెబుతున్నారు. ఫ్ల‌యిట్‌రేడార్‌24 వెబ్‌సైట్ ఆ విమానానికి చెందిన డేటాను రిలీజ్ చేసింది. టేకాఫ్ తీసుకున్న నిమిషం లోపే ఏటీసీతో విమాన సంబంధాలు తెగిపోయిన‌ట్లు ఫ్ల‌యిట్‌రేడ‌ర్ పేర్కొన్న‌ది.

టేకాఫ్‌ అయిన నిమిషాల్లోనే సివిల్‌ ఆసుపత్రి సమీపంలో జనావాసాలపై కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. అయితే, విమానం కూలుతున్న దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. ఫ్లైట్‌ భూమిని తాకగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అనంతరం పెద్ద ఎత్తున పొగ ఎగసిపడింది. 

సమాచారం అందుకున్న అధికారులు హుటా హుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.  ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య ఎక్కువగానే ఉంటుందని జాతీయ మీడియా పేర్కొంటోంది. ఆ కూలిన విమానంలో గుజ‌రాత్ మాజీ సీఎం విజ‌య్ రూపానీ లండ‌న్ వెళ్తున్న‌ట్లు స‌మాచారం. ఈ ఘటనతో అహ్మదాబాద్‌ విమానాశ్రయం కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఎయిర్‌పోర్ట్‌ కార్యకలాపాలను నిలిపివేసినట్లు ఎయిర్‌పోర్ట్‌ ప్రతినిధి వెల్లడించారు. తదుపరి నోటీసులు వచ్చే వరకూ ఈ చర్యలు అమల్లో ఉంటాయని ప్రకటించారు. 

గుజరాత్‌ విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహ‌న్ నాయుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాలతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాద ఘటనపై ఆరా తీశారు. ఘటనాస్థలి వద్ద సహాయక చర్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాదు ఎప్పటికప్పుడు వివరాలను తనకు అప్‌డేట్‌ చేయాలని కేంద్రమంత్రులను ప్రధాని ఆదేశించారు.

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంపై కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హుటాహుటిన అహ్మదాబాద్‌కి బయలుదేరారు. ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్ సీఎంలతో ఫోన్లో మాట్లాడారు. విమాన ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఆరా తీశారు. విమాన ప్రమాదం మాటల్లో చెప్పలేని బాధను కలిగించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. విపత్తు ప్రతిస్పందన దళాలను వెంటనే ప్రమాద స్థలానికి తరలించినట్లు చెప్పారు. పరిస్థితిని అంచనా వేయడానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, రాష్ట్ర హోం మంత్రితో మాట్లాడినట్లు అమిత్ షా వివరించారు.