విమాన ప్రమాదంలో మొత్తం 242 మంది మృతి

విమాన ప్రమాదంలో మొత్తం 242 మంది మృతి
 
* గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని మృతి
 
అహ్మ‌దాబాద్‌లో జ‌రిగిన విమాన ప్ర‌మాదంలో 242 మంది మ‌ర‌ణించారు. విమానాశ్ర‌యం నుంచి టేకాఫ్ తీసుకున్న కొన్ని క్ష‌ణాల్లోనే ఆ విమానం కూలింది. ప్ర‌మాదం నుంచి ఎవ‌రూ బ్ర‌తికిన‌ట్లు లేర‌ని అహ్మ‌దాబాద్ పోలీసు క‌మీష‌న‌ర్ జీఎస్ మాలిక్ తెలిపారు. రెసిడెన్షియ‌ల్ ప్రాంతంలో విమానం కూల‌డం వ‌ల్ల అద‌నంగా మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. 
 
అయితే బోయింగ్ డ్రీమ్‌లైన‌ర్ ప్ర‌మాదం వ‌ల్ల మొత్తం ఎంత మంది చ‌నిపోయార‌న్న విష‌యాన్ని ఇప్పుడే చెప్ప‌లేమ‌ని, దానిపై త్వ‌ర‌లో ప్ర‌క‌ట‌న చేస్తామ‌ని చెప్పారు. కాగా, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజ‌య్ రూపానీ (68) విమాన ప్రమాదంలో  విజ‌య్ రూపానీ మృతి చెందిన‌ట్లు గుజ‌రాత్ ప్ర‌భుత్వం కూడా అధికారికంగా ప్ర‌క‌టించింది.
 
 ప్ర‌మాదం జ‌రిగిన ఎయిరిండియా విమానంలోనే విజ‌య్ రూపానీ లండ‌న్ బ‌య‌ల్దేరిన‌ట్లు బోర్డింగ్ పాస్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. అంతేకాకుండా విమానంలో ప్ర‌మాదానికి ముందు ఓ వ్య‌క్తి విజ‌య్ రూపానీతో సెల్ఫీ దిగిన ఫొటో కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. విజ‌య్ రూపానీ 2016 నుంచి 2021 వ‌ర‌కు గుజ‌రాత్‌కు 16వ ముఖ్య‌మంత్రిగా సేవలందించారు. ఆరు ద‌శాబ్దాల క్రితం గుజ‌రాత్ రెండో సీఎం బ‌ల్వంత్‌రాయ్ మెహ‌తా కూడా ఇలాగే విమాన ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయారు.
 
ఎయిర్‌ ఇండియా విమానం గురువారం మ‌ధ్యాహ్నం 1.39 గంట‌ల‌కు ఇద్దరు పైల‌ట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బందితో పాటు 242 మంది ప్రయాణికుల‌తో లండ‌న్ బ‌య‌ల్దేరింది. మొత్తం 242 మందిలో 169 మంది భారతీయులుగా అధికారులు తెలిపారు. మరో 53 మంది బ్రిటన్‌ దేశస్థులు, ఏడుగురు పోర్చుగల్‌ పౌరులు, ఒకరు కెనడా జాతీయుడు ఉన్నారు.
 
 విమానం టేకాఫ్‌ అయిన నిమిషాల వ్యవధిలోనే ఎయిర్‌పోర్టుకు స‌మీపంలోని సివిల్ ఆస్పత్రి వ‌ద్ద బీజే మెడిక‌ల్ కాలేజీ హాస్టల్ భ‌వ‌నంపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 133 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరోవైపు ప్రమాదంలో హాస్టల్‌ భవనాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. అందులోని 20 మంది మెడికోలు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై బ్రిటన్‌ ప్రధాన మంత్రి కీర్‌ స్టార్మర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బ్రిటీష్ పౌరులతో లండన్‌ వెళ్తున్న విమానం అహ్మదాబాద్‌లో కూలిపోయిందని, పరిస్థితిపై భారత్‌ను సంప్రదిస్తున్నట్లు తెలిపారు.

“బ్రిటీష్‌ జాతీయులతో లండన్‌ వెళ్తున్ ఎయిర్‌ ఇండియా విమానం భారతదేశంలోని అహ్మదాబాద్‌ నగరంలో కూలిపోయింది. ఆ దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. పరిస్థితిపై భారత్‌ను సంప్రదించి వివరాలు తెలుసుకుంటున్నాం. ప్రమాదంలో చిక్కుకున్న వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా”  అని తన ఎక్స్‌ పోస్ట్‌లో కీర్‌ స్టార్మర్‌ పేర్కొన్నారు.

కాగా, అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా గురువారం సాయంత్రం నిర్వహించ తలపెట్టిన విజయోత్సవ సభను శుక్రవారంకు వాయిదా వేసింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం కారణంగా సభను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది