
* 3 గంటల్లోనే గుంటూరు నుంచి సికింద్రాబాద్ కు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కీలకమైన నల్లపాడు-బీబీనగర్ (పగిడిపల్లి) రెండో రైల్వే లైను నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది (2025-26)కి రూ. 452.36 కోట్లు కేటాయించింది. మొత్తం పనులు ఐదేళ్లలో పూర్తి చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. విష్ణుపురం-కుక్కడం మధ్య 55 కిలో మీటర్లు, కుక్కడం-వొలిగొండ మధ్య 75 కిలో మీటర్ల పనులు వేగంగా జరుగుతున్నాయి.
రెండో దశలో నల్లపాడు-బెల్లంకొండ మధ్య 56 కిలో మీటర్ల పనులకు టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతున్నారు. రెండో రైల్వే లైను నిర్మాణం, విద్యుదీకరణ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. నల్లపాడు-బీబీనగర్ మధ్య 248 కిలో మీటర్ల రైల్వే లైను నిర్మాణానికి రూ. 2853 కోట్లు ఖర్చు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.
ఈ మొత్తాన్ని కేంద్రమే భరించనుంది. ఈ మార్గాన్ని మొత్తం 6 దశల్లో పూర్తి చేయాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. పనులు పూర్తయిన మార్గాన్ని వెంటనే వినియోగించుకునే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా మొదటి దశలో విష్ణుపురం-కుక్కడం-వొలిగొండ లైను పనులు వేగంగా జరుగుతున్నాయి.
ఇక్కడ 10 మేజర్, 259 మైనర్ వంతెనల నిర్మించనున్నారు. ఈ మార్గంలో వచ్చే డిసెంబరుకు కనీసం 30 కిలో మీటర్ల మార్గం పూర్తి చేయాలని అధికారులు టార్గెట్గా పెట్టుకున్నారు. రెండో రైల్వేలైను నిర్మాణానికి మొత్తం 200 హెక్టార్ల భూమి అవసరమని ఇప్పటికే అధికారులు అంచనా వేశారు. ఇందులో ఏపీ పరిధిలో 135 హెక్టార్లు కాగా, మిగిలింది తెలంగాణలో ఉంది.
సికింద్రాబాద్ నుంచి బీబీనగర్ వరకు రెండు లైన్ల రైల్వే లైను ఉంది. ఆ తర్వాత తెలంగాణలోని పగిడిపల్లి స్టేషన్ నుంచి నల్గొండ-మిర్యాలగూడతో పాటు ఏపీలోని నల్లపాడు వరకు ఒకలైను మాత్రమే ఉంది. దీంతో ఈ మార్గంలో ఒక ట్రైన్ వస్తుంటే మరో బండిని స్టేషన్లోనే ఆపాల్సి వస్తోంది. ట్రాక్ సామర్థ్యంతో పోలిస్తే 140% రైళ్లు నడుస్తున్నాయి. ప్రయాణికుల రద్దీ, అవసరాల దృష్ట్యా ఈ మార్గాన రెండో రైల్వే లైను నిర్మాణానికి కేంద్రం అనుమతించింది.
ఈ మార్గంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో పాటు సికింద్రాబాద్ నుంచి దక్షిణాది రాష్ట్రాలకు రాకపోకలు సాగించేందుకు ఇది కీలకమార్గం కావడంతో ఈ లైను పనులను ఉన్నతాధికారులు నేరుగా పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే రైలులో గుంటూరు నుంచి సికింద్రాబాద్ కేవలం 3 గంటల్లోనే చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
More Stories
కాకినాడ మెడికల్ కాలేజీలో లైంగిక వేధింపులు
టిటిడిలో వేయి మందికి పైగా అన్యమతస్థులు
అధిక పొగ వాహనాలకు తిరుమలలో ప్రవేశం లేదు