
ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం ఏర్పాట్లపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఆపరేషన్ సిందూర్‌పై నాలుగు దేశాల్లో పర్యటనపై పలు అంశాలను టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రధానమంత్రిని కలిసి వివరించిన సందర్భంగా యోగా డే అంశం ప్రస్తావనకు వచ్చింది. ‘‘మంత్రి నారా లోకేశ్ వ్యక్తిగతంగా యోగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్టు తెలిసింది. గిన్నిస్ బుక్ రికార్డు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు విన్నాను. లోకేశ్ ఇందుకోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారట కదా’’ అని ప్రధాని అన్నారని తెలిపారు.
ఏపీ సర్కార్ తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధని ప్రధాని మోదీ అభినందించారని లావు శ్రీకృష్ణదేవరాయలు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రదేశాల్లో యోగా నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రజాప్రతినిధులు అంతా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సిద్ధమయ్యారని ప్రధానికి వివరించినట్లు పేర్కొన్నారు. ఏపీలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రికార్డు సృష్టించేలా నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.
కనీసం రెండు కోట్ల మందికి ఈ కార్యక్రమం చేరేలా ప్లాన్ చేస్తోంది. అదేవిధంగా గిన్నిస్ వరల్డ్ రికార్డే లక్ష్యంగా విశాఖలో యోగా డే నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 5 లక్షల మంది పాల్గొనేలా ఆర్‌కే బీచ్ నుంచి శ్రీకాకుళం బీచ్ వరకు అనుకూల ప్రాంతాలన్నింట్లో కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రధాని మోదీ హాజరవుతున్న ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించి రాష్ట్రంలో యోగాభ్యాసానికి నాంది పలకాలని చూస్తున్నారు.
ఈ మేరకు సుమారు 2.5 లక్షల మంది ఇందులో పాల్గొనేలా చర్యలు చేపడుతున్నారు. 68 ప్రాంతాల్లో 2,58,948 మందికి యోగా సాధనకు అవకాశం కల్పించనున్నారు. ఆర్‌కే బీచ్, రుషికొండ, స్కూల్, క్రికెట్, పోలీస్, క్రీడా, నేవీ ప్రాంగణాలతో పాటు పలు ఖాళీ ప్రదేశాలను యోగా నిర్వహణకు అధికారులు గుర్తించారు. 2023లో సూరత్‌లో 1,53,000 మందితో నిర్వహించి గిన్నిస్ వరల్డ్ రికార్డుకు ఎక్కింది. ఈసారి ఆ రికార్డును తిరగరాయాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ దిశగా ముమ్మర చర్యలు చేపడుతుంది.
More Stories
26 నుంచి 30 వరకూ సింగపూర్‌లో చంద్రబాబు పర్యటన
దుర్గమ్మకు ఆషాడం సారెతో ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్త జనం
అమరావతిలో మరోసారి భూసేకరణపై మంత్రులే వ్యతిరేకం!