అమరావతి మహిళలపై వ్యాఖ్యల కేసులో కృష్ణంరాజు అరెస్ట్‌

అమరావతి మహిళలపై వ్యాఖ్యల కేసులో కృష్ణంరాజు అరెస్ట్‌
అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో జర్నలిస్టు కృష్ణంరాజును పోలీసులు అరెస్ట్‌ చేశారు. గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న అతన్ని భీమిలి గోస్తనీనది సమీపంలో సెల్​టవర్‌ లోకేషన్‌ ఆధారంగా పట్టుకున్నారు. కృష్ణంరాజు వెంట ఉన్న మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురినీ తుళ్లూరు పోలీసులు గురువారం మంగళగిరి కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.
 
వైసీపీకి చెందిన సాక్షి టీవీలో కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించి చర్చ కార్యక్రమంలో జర్నలిస్ట్ కృష్ణంరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ కృష్ణంరాజు మాట్లాడుతూ రాజధాని అమరావతి వేశ్యల రాజధాని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తం ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది.
‘అమరావతి దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని’ అంటూ కృష్ణంరాజు మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. 
 
మరోవైపు ఇదే వ్యవహారంలో సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఆయనకు మంగళగిరి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. అదేవిధంగా కృష్ణంరాజు కోసం ముమ్మరంగా గాలించిన పోలీసులు భీమిలీలో అదుపులోకి తీసుకున్నారు. అజ్ఞాతంలో నుంచే తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ వీడియో కూడా విడుదల చేశారు.
 
ఈ వ్యాఖ్యలకు నిరసనగా తుళ్లూరు పోలీస్ స్టేషన్‌కు ర్యాలీగా వెళ్లి ఫిర్యాదు చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో వీరిపై కేసులు నమోదు చేశారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ సైతం స్పందించింది. ఈ వ్యాఖ్యలపై జాతీయ మానవ హక్కుల సంఘానికి టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు ఫిర్యాదు చేశారు.

ఈ కేసులో కృష్ణంరాజు హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్ కూడా దాఖలు వేశారు. పోలీసులు తన కోసం గాలిస్తున్నారని, తనను అరెస్టు చేసి బాధించాలని చూస్తున్నారని పిటిషన్‌లో హైకోర్టుకు విన్నవించారు. అమరావతితో పాటు విజయవాడ చుట్టుపక్కల తనకు ఆస్తులు ఉన్నాయని తాను ఎక్కడికీ పారిపోలేదని పేర్కొన్నారు. 
 
పోలీసుల విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌లో కృష్ణంరాజు చెప్పుకొచ్చారు. జర్నలిస్ట్ కృష్ణంరాజు ముందస్తు బెయిల్ పిటిషన్ మీద జూన్ 12 హైకోర్టు విచారణ జరపనుంది. అయితే ఆలోపే పోలీసులు జర్నలిస్ట్ కృష్ణంరాజును అరెస్ట్ చేశారు. మరోవైపు కృష్ణంరాజు ఆచూకీ కనిపెట్టేందుకు అధికారులు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు.