తమిళనాడు పిటిషన్‌ అత్యవసర జాబితాకు సుప్రీం నిరాకరణ

తమిళనాడు పిటిషన్‌ అత్యవసర జాబితాకు సుప్రీం నిరాకరణ

సమగ్ర శిక్షా పథకం కింద తమ వాటా నిధులను కేంద్రం నిలిపివేయడంపై పిటిషన్‌ను అత్యవసర జాబితా చేయాలన్న తమిళనాడు అభ్యర్థనను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. సమగ్ర శిక్ష పథకం కింద రాష్ట్రానికి అందాల్సిన రూ.2000 కోట్లకు పైగా నిధులను నిలిపివేసినట్లు స్టాలిన్‌ ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. ఈ కేసులో అత్యవసర పరిస్థితి లేదంటూ జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా నేతృత్వంలోని వెకేషన్‌ బెంచ్‌ పేర్కొంది. 

జూన్‌ 3న విద్యా సంవత్సరం ప్రారంభమైందని, నిధుల కొరత రాష్ట్రంలోని సుమారు 48 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని తమిళనాడు తరపు సీనియర్‌ న్యాయవాది పి.విల్సన్‌ కోర్టుకు తెలిపారు. ఎప్పటి నుండి నిధులు నిలిచిపోయాయని జస్టిస్‌ మిశ్రా ప్రశ్నించగ గతేడాది నిధులు అందలేదని, తాము ఈ ఏడాది మే 20న పిటిషన్‌ దాఖలు చేశామని విల్సన్‌ పేర్కొన్నారు. 

అత్యవసర పరిస్థితి లేదంటూ జస్టిస్‌ మిశ్రా పిటిషన్‌ను జాబితా చేసేందుకు తిరస్కరించారు. సమగ్ర శిక్షా పథకం నిధులు పంపిణీ చేయకపోవడానికి ”స్పష్టమైన, ప్రత్యక్షమైన” కారణం, కేంద్రం త్రిభాషా పథకంతో కూడిన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి ) 2020,  ఎన్‌ఇపి ఆదర్శప్రాయమైన పిఎం శ్రీ పాఠశాలల పథకాన్ని విధించడాన్ని స్టాలిన్‌ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించడంతో ముడిపడి వుందని న్యాయవాదులు విల్సన్‌, అపూర్వ్‌ మల్హోత్రాలు పిటిషన్‌లో పేర్కొన్నారు. 

పిఎం శ్రీ పాఠశాలల పథకం రాష్ట్రంలో పూర్తిగా ఎన్‌ఇపి 2020 అమలును తప్పనిసరి చేస్తుందని తెలిపింది. సమగ్ర శిక్షా పథకం కింద నిధులు పొందే రాష్ట్ర హక్కును కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. సహకార సమాఖ్య సిద్ధాంతం గురించి తెలియకపోవడమే కారణమని పిటిషన్‌ వాదించింది. 

విద్యానిధులను నిలిపివేయడం అంటే ఎంట్రీ 25, జాబితా 3 కింద చట్టం చేయడానికి రాష్ట్రానికి ఉన్న రాజ్యాంగ అధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని, రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌ఇపి-2020ని పూర్తిగా అమలు చేయాలని, రాష్ట్రంలో అనుసరిస్తున్న విద్యా విధానం నుండి వైదొలగాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు యత్నిస్తోందని పిటిషన్‌ పేర్కొంది.