రెండేళ్ల‌లో అమెరికాను త‌ల‌పించేలా భారతీయ రహదారులు

రెండేళ్ల‌లో అమెరికాను త‌ల‌పించేలా భారతీయ రహదారులు
భార‌తీయ ర‌హ‌దారులు మ‌రో రెండేళ్ల‌లో అమెరికాను త‌ల‌పిస్తాయ‌ని కేంద్ర రోడ్డు, ర‌వాణాశాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ తెలిపారు. రోడ్ల మౌళిక స‌దుపాయాలు పెరుగుతున్న‌ట్లు చెప్పారు. గ‌త ప‌దేళ్ల నుంచి రోడ్డు, ర‌వాణా వ్య‌వ‌స్థను మెరుగుప‌రిచేందుకు ఖ‌ర్చుల‌ను పెంచుతున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.  ఎప్పుడో రోడ్డు, ర‌వాణా వ్య‌వ‌స్థ మారింద‌ని, మీరు కేవ‌లం న్యూస్ రీల్ చూశార‌ని, అస‌లైన సినిమా స్టార్ట్ కావాల్సి ఉంద‌ని, ప్ర‌స్తుతం కొన్ని ప్రాజెక్టులు పురోగ‌మ‌న దిశ‌లో ఉన్నాయ‌ని, మ‌రో రెండేళ్ల‌లో భార‌తీయ రోడ్ల‌ వ్య‌వ‌స్థ‌ అమెరికాకు స‌మానంగా ఉంటుంద‌ని మంత్రి ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

అమెరికాకు చెందిన కొంద‌రు త‌న‌ను క‌లిశార‌ని, వాళ్ల రోడ్ల వ్య‌వ‌స్థ క‌న్నా మ‌న‌ది బెట‌ర్‌గా ఉన్న‌ట్లు చెప్పార‌ని గుర్తు చేశారు. త‌మ ప్ర‌భుత్వం వేసిన నాణ్య‌మైన రోడ్ల వ‌ల్ల‌ లాజిస్టిక్ ఖ‌ర్చులు భారత్ లో త‌గ్గిన‌ట్లు మంత్రి తెలిపారు. దీని వ‌ల్ల ఎగుమ‌తిలో పోటీత‌త్వం పెరుగుతుంద‌ని, ఒక‌వేళ మ‌నం మ‌న ఎగుమ‌తుల్ని పెంచితే, అది మ‌న వ్య‌వ‌సాయ, ఉత్ప‌త్తి, సేవా రంగాల‌ను బ‌లోపేతం చేస్తుంద‌ని వివరించారు. 

భారత్ లో లాజిస్టిక్స్ ఖ‌ర్చులు ఎక్కువ అని, అది 16 శాతంగా ఉంద‌ని, చైనాలో కేవ‌లం 8 శాతం మాత్ర‌మే ఉంద‌ని గడ్కరీ చెప్పారు. ఇక అమెరికా, యూరోప్ దేశాల్లో లాజిస్టిక్స్ ఖ‌ర్చులు 12 శాతం ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. గ‌తంలో మ‌న రోడ్లు స‌రిగా లేవ‌ని, మ‌న పోర్టులు స‌రిగా లేవ‌ని, ట్రాఫిక్ వ‌ల్ల ఖ‌ర్చులు పెరిగేవ‌ని పేర్కొన్నారు. రోడ్ల‌ను మెరుగుప‌ర‌చ‌డం వ‌ల్ల లాజిస్టిక్ ఖ‌ర్చుల‌ను 9 శాతం త‌గ్గించిన‌ట్లు ఆయ‌న చెప్పారు. 

25 గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలు, 3 వేల కిలోమీట‌ర్ల పోర్టు క‌నెక్టివిటీ హైవే, దైవ‌క్షేత్రాల‌ను క‌లుపుతూ రూ. ల‌క్ష కోట్ల విలువైన రోడ్డు ప‌నుల‌ను చేప‌ట్టిన‌ట్లు మంత్రి గ‌డ్క‌రీ తెలిపారు. వివిధ వాతావ‌ర‌ణాల‌ను త‌ట్టుకునే రీతిలో బౌద్ధ‌, ఛార్‌ధామ్ క్షేత్రాల‌ను క‌లిపే రోడ్ల‌ను నిర్మించిన‌ట్లు చెప్పారు. జ‌మ్మూ, శ్రీన‌గ‌ర్ మ‌ధ్య 36 ట‌న్నెల్స్‌ను డెవ‌ల‌ప్ చేశామ‌ని, 23 ట‌న్నెల్స్ పూర్తి అయ్యాయ‌ని, మ‌రో నాలుగైదు నిర్మాణంలో ఉన్న‌ట్లు తెలిపారు. ప‌ర్వ‌త‌మాలా యోజ‌న కింద 15 రోప్‌వేల‌ను డెవ‌ల‌ప్ చేస్తున్నామ‌ని, దీంతో పాటు 35 మ‌ల్టీ మోడ‌ల్ లాజిస్టిక్స్ పార్కుల‌ను అభివృద్ధి చేస్తున్నామ‌ని తెలిపారు.