
ఆర్సీబీ విజయోత్సవం సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వంకు సంబంధం లేదని, అది క్రికెట్ అసోసియేషన్ జరుపుకున్న ప్రైవేట్ కార్యక్రమం అన్నట్లు ముఖ్యమంత్రి సిద్దరామయ్య చెప్పుకొచ్చారు. అయితే ఈ ఘటన నేపథ్యంలో కర్ణాటక రాజ్‌భవన్ వర్గాలు తాజాగా భిన్నమైన విషయాన్ని వెల్లడించాయి.
18 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ కప్పును ముద్దాడిన ఆర్‌సీబీ ఆటగాళ్లను సన్మానించాలని గవర్నర్ తొలుత భావించినట్లు తెలిపాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం విధాన సౌధలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిసిందని పేర్కొన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నుంచి గవర్నర్‌కు అధికారికంగా ఆహ్వానం కూడా అందినట్లు రాజ్‌భవన్ వర్గాలు తాజాగా వెల్లడించాయి.
అయితే, సన్మాన కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం కాదని ఇటీవలే సిద్ధరామయ్య ప్రకటించడం గమనార్హం. ఇది కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంగా సీఎం తెలిపారు. కేఎస్‌సీఏ సభ్యులు ఆహ్వానిస్తేనే తాను ఆర్సీబీ ఈవెంట్‌కు వెళ్లానని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా క్రికెట్ సంఘం గవర్నర్‌ను ఆహ్వానించినట్లు కూడా సిద్ధరామయ్య ఇటీవలే ప్రకటించారు.
“డీపీఆర్ కమ్మూనికేషన్ తర్వాత ప్రధాన కార్యదర్శి నన్ను అడిగారు. పోలీసులు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అంగీకారం తెలిపారు. అప్పుడే నేను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. ఆ తర్వాత కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కోశాధికారి, కార్యదర్శి నా దగ్గరకు వచ్చి ఆర్‌సీబీ ఈవెంట్‌కు హాజరు కావాలని ఆహ్వానించారు” అని తెలిపారు.
పైగా, “ఈ కార్యక్రమానికి గవర్నర్ సైతం వస్తున్నారని వారు నాతో చెప్పారు. అందుకే నేను హాజరయ్యాను. ఇది నేను నిర్వహించిన కార్యక్రమం కాదు. ఇందులో నా పాత్ర లేదు” అని సిద్ధరామయ్య ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు రాజ్‌భవన్ ప్రకటన సీఎం వ్యాఖ్యలకు విరుద్ధంగా ఉండటం గమనార్హం. చిన్నస్వామి స్టేడియం సమీపంలోని కర్ణాటక విధాన సౌధ వద్ద క్రికెటర్లకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో సీఎం సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్న విషయం తెలిసిందే.
ఇలా ఉండగా, బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట ఘటనపై విచారణను కర్ణాటక హైకోర్టు ఈ నెల 12కి వాయిదా వేసింది. సీల్డ్ కవర్‌లో సమాధానం దాఖలు చేయాలని అడ్వకేట్ జనరల్ (ఎజి) శశికిరణ్ శెట్టిని కోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్‌ను తాత్కాలిక ప్రధాన జడ్జి వి.కామేశ్వర్ రావు, జడ్జి సి.ఎం.జోషి సుమోటోగా విచారించారు. మంగళవారం విచారణ సందర్భంగా ఈ ఘటనపై సమాధానం దాఖలు చేయలేదని విచారణ సమయంలో ఎజి కోర్టుకు తెలిపారు.
విచారణ కోసం జ్యుడీషియల్ కమిటీని నియమించామని, ఒక నెలలోగా రిపోర్ట్ సమర్పించాల్సిందిగా ఆదేశించామని చెప్పారు. పోలీస్ అధికారులను కూడా సస్పెండ్ చేసినట్లు తెలిపారు. జూన్4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సిబి నిర్వహించిన పరేడ్ తొక్కిసలాటలో 11మంది మరణించిన సంగతి తెలిసిసందే. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన కర్ణాటక హైకోర్టు నివేదికను దాఖలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
More Stories
ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధంలో ఏకాకిగా ఇరాన్
ఇరాన్ గగనతలాన్ని తెరవడంతో 290 మంది రాక
స్విస్ బ్యాంకుల్లో 18 శాతం తగ్గిన భారతీయుల డిపాజిట్లు