2025 సంవత్సరంలో భారత దేశ జనాభా 146 కోట్లకు చేరుకుంటుందని ఐక్యరాజ్యసమితి ఓ నివేదిక రిలీజ్ చేసింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ నిలుస్తుందని యూఎన్ డెమోగ్రాఫిక్ రిపోర్టులో తెలిపారు. దేశంలో పునరుత్పత్తి శాతం పడిపోయినట్లు ఆ నివేదికలో వెల్లడించారు. యూఎన్ఎఫ్‌పీఏ 2025 స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్టులో ఈ విషయాన్ని తెలిపారు.
లక్షల సంఖ్యలో జనం ఫెర్టిలిటీ లక్ష్యాలను అందుకోవడం లేదని ఆ నివేదికలో చెప్పారు. ఇది నిజమైన సంక్షోభంగా మారుతోందని, దీనికి గల కారణాలు కూడా భిన్నంగా ఉన్నాయని, శృంగారం.. కాంట్రాసెప్షన్, ఫ్యామిలీ అంశాల్లో అవగాహన మారడం వల్ల ఈ సమస్య తలెత్తినట్లు ఆ రిపోర్టులో తెలిపారు. భారత్‌లో ఫెర్టిలిటీ రేటు తగ్గిందని, ఆ రేటు 1.9 శాతానికి తగ్గినట్లు రిపోర్టులో వెల్లడించారు. ఆ రేటు కనీసం 2.1గా ఉండాల్సి ఉంది.
అంటే భారతీయ మహిళలు సగటున తక్కువ మంది పిల్లలకు జన్మనిస్తున్నట్లు అంచనా వేశారు. జననాల రేట్ తక్కువగా ఉన్నప్పటికీ దేశంలో యువత జనాభా బాగానే ఉన్నట్లు పేర్కొన్నారు. 0 నుంచి 14 ఏళ్ల వారి సంఖ్య 24 శాతంగా, 10 నుంచి 19 ఏళ్ల వారి సంఖ్య 17 శాతంగా, 19 నుంచి 24 వరకు 26 శాతంగా ఉన్నట్లు తేల్చారు. 15 నుంచి 64 ఏళ్ల వర్కింగ్ గ్రూపులో ఉన్నవారి సంఖ్య 68 శాతంగా ఉన్నట్లు తెలిసింది. 65 ఏళ్లు దాటిన వారి సంఖ్య ఏడు శాతంగా ఉంది.
అయితే భవిష్యత్తులో వయోవృద్ధుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. 2025లో పుట్టిన వారి జీవన కాల అంశాన్ని నిర్దారించారు. సగటున మగవాళ్లు 71 ఏళ్లు, ఆడవాళ్లు 74 ఏళ్లు బ్రతికే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేశారు. భారత జనాభా త్వరలో 150 కోట్లకు చేరుకుంటుందని, ఆ తర్వాత 170 కోట్ల వరకు వెళ్తుందని, అయితే మరో 40 ఏళ్లలో ఆ జనాభా తరుగుదల స్టార్ట్ అవుతుందని రిపోర్టులో పేర్కొన్నారు.1960లో భారతీయ జనాభా 44 కోట్లు ఉండేదని, ఆ సమయంలో మహిళలు కనీసం సగటును ఆరుమందిని కనేవారని, అప్పట్లో గర్భనిరోధక విధానాలు తక్కువ అని, ప్రాథమిక విద్య కూడా తక్కువగా ఉండేదన్నారు. కానీ రిప్రొడక్టివ్ హెల్త్‌కేర్‌పై అవగాహన పెరగడంతో ఫెర్టిలిటీ రేటు తగ్గుతూ వచ్చిందన్నారు. ప్రస్తుతం సాధారణ భారతీయ మహిళ ఇద్దరికి జన్మనిస్తోందని రిపోర్టులో పేర్కొన్నారు.
1970లో అయిదుగుర్ని కనేవాళ్లు, ఇప్పుడు ఆ సంఖ్య రెండుకు చేరిందని, పునరుత్పత్తి ఆరోగ్య విషయంలో భారతీయ మహిళల్లో అవగాహన పెరిగిందని యూఎన్ఎఫ్‌పీఏ ప్రతినిధి ఆండ్రియా ఎం వోజ్నర్ తెలిపారు. మెటర్నటీ మోర్టాలిటీ కూడా తగ్గినట్లు తేల్చారు.
కాగా, ప్రపంచ దేశాల్లో సంతానోత్పత్తి సంక్షోభం ఏర్పడిందని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. కుటుంబ నియంత్రణ చర్యలు, గర్భనిరోధక సాధనాల వినియోగం, లైంగిక ఆరోగ్యం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఎవరికి వారుగా సంతానోత్పత్తి నిర్ణయాలను తీసుకోవాలని నివేదికలో పేర్కొంది. ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు వారి వ్యక్తిగత సంతానోత్పత్తి లక్ష్యాలను గుర్తించలేకపోయారని, జనాభా అంశంలో ప్రస్తుతానికి ఇదే నిజమైన సంక్షోభమని అని ఐరాస హెచ్చరించింది.
More Stories
భారత్ `విశ్వగురువు’గా మారడమే ప్రపంచ శాంతికి మార్గం
మంత్రివర్గం అనుమతి లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా
కేరళ రాజ్‌భవన్ లో భారత మాత ఫొటోతో మంత్రులు వాకౌట్