ఫోన్ ట్యాపింగ్‌తో సంబంధం లేదన్న ప్రభాకర్ రావు

ఫోన్ ట్యాపింగ్‌తో సంబంధం లేదన్న ప్రభాకర్ రావు
ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంతో తనకేలాంటి సం బంధం లేదని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు సిట్ అధికారులకు ఖరాకండిగా తేల్చిచెప్పారు. 15 నెలలుగా అమెరికాలో తలదాచుకున్న ప్రభాకర్‌రావు సోమవారం సిట్ విచారణకు హాజరయ్యారు. వెస్ట్‌జోన్ డిసిపి విజయ్ కుమార్ నేతృత్వంలో జూబ్లీహిల్స్ ఎసిపి వెంకటగిరి సహా ఐ దుగురు సభ్యుల బృందం ప్రభాకర్‌రావు ను 8 గంటలపాటు సుదీర్ఘంగా విచారించింది.

ప్రభాకర్‌రావు స్టేట్‌మెంట్‌ను సిట్ బృందం వీడియో రికార్డింగ్ చేసింది. మొదటి రోజు విచారణ ముగిసిన అనంతరం ఈ నెల 11న మరోసారి విచారణ కు హాజరుకావాల్సిందిగా ప్రభాకర్‌రావును సిట్ ఆదేశించింది. ఈసారి విచారణకు వచ్చేటప్పుడు తన వెంట ల్యాప్ టాప్, మ్యాక్ బుక్‌తో పాటు అప్పట్లో ఉపయోగించిన రెండు సెల్ ఫోన్లను కూడా తీసుకరావాల్సిందిగా సిట్ సూచించింది. 

విచారణ సందర్భంగా ప్రభాకర్‌రావుపై సిట్ బృందం ప్రశ్నల వర్షం కురిపించినప్పటికీ ఆయన ఏమాత్రం తొణక బెణకకుండా ధీటుగా సమాధానం చెప్పినట్టు తెలిసింది. ఈ కేసులో నిందితులు తిరుపతన్న, రాధాకిషన్‌రావు, ప్రణీత్‌రావు, భుజంగరావు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారాలను ప్రభాకర్‌రావు ముందు ఉంచి సిట్ ప్రశ్నించినట్లు సమాచారం.

ఫోన్‌లు ట్యాప్ చేయాలని తాను ఎవరికీ ఆదేశాలు ఇవ్వలేదని, తాను అలా ఆదేశాలు ఇచ్చినట్లు ఆధారాలు ఉంటే చూపించాల్సిందిగా ప్రభాకర్‌రావు ఎదురు ప్రశ్నించారని తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే దానికో రివ్యూ కమిటీ ఉంటుందని, ఆ కమిటీలో తాను సభ్యుడిని కాదని ప్రభాకర్‌రావు తోసిపుచ్చినట్టు సమాచారం . తాను డిసెంబర్ 4 వ తేదీ 2023 సాయంత్రం 4 గంటలకు రాజీనామా చేశానని, అదే రోజు రాత్రి 8 గంటలకు హార్డ్ డిస్కులు ధ్వంసం అయితే తనకేం సంబంధం అని ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది. 

ఫోన్ ట్యాపింగ్ రివ్యూ కమిటీ సభ్యులను ఈ కేసులో ఎందుకు ఇన్ వాల్వ్ చేయలేదో చెప్పాలని కూడా సిట్ అధికారులను ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన వెంటనే విదేశాలకు ఎందుకు వెళ్లారు?, హార్డ్‌డిస్క్‌లను ఎవరు ధ్వంసం చేశారు?, మీ ఆదేశాలతోనే ప్రణీత్‌రావు హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేశారా?, స్పెషల్ ఆపరేషన్ టీంను ఎవరి ఆదేశాల మేరకు ఏర్పాటు చేశారు? అని సిట్ బృందం ప్రభాకర్‌రావుపై ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలిసింది. 

హార్డ్‌డిస్క్‌ల ధ్వంసం వెనుక కుట్ర స్పష్టంగా కనిపిస్తోందని, శ్రవణ్ రావు ప్రైవేట్ వ్యక్తి అతనికి ఎస్‌ఐబితో సంబంధాలేమిటి? మీరు (ప్రభాకర్‌రావు), ప్రణీత్ రావ్, శ్రవణ్ రావు ముగ్గురూ తరచుగా ఎందుకు భేటీ అయ్యేవారు? అని సిట్ ప్రశ్నించినప్పటికీ ప్రభాకర్‌రావు సరైన సమాధానం ఇవ్వకుండా దాటవేసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.