
సింధూ జలాల ఒప్పందం నిలిపివేత కారణంగా నీటి కటకట ఏర్పడుతుండటంతో పాకిస్థాన్ కాళ్ల బేరానికి వస్తోంది. ఖరీఫ్ సీజన్‌లో నీటి కష్టాలు తీవ్రమయ్యే అవకాశం ఉండటం వల్ల సింధూ జలాలపై నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలని మరోసారి భారత్‌ను కోరింది. పాక్ అభ్యర్థనను భారత్ తోసిపుచ్చింది. ఉగ్రవాదం సమస్య పరిష్కారం అయ్యే వరకూ సింధూ జలాల ఒప్పందంపై నిలిపివేత కొనసాగుతుందని, పాక్‌తో చర్చలు ఉండబోవని స్పష్టం చేసింది.
ఇటీవల సింధూ జలాలపై చర్చించాలని భారత్‌కు పాకిస్థాన్ వరుస లేఖలు రాస్తోంది. ఈ క్రమంలోనే పాకిస్థాన్ జల వనరుల కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తాజా భారత్ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలంటూ మరోసారి కోరారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత్ లేవనెత్తిన అభ్యంతరాలపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్టు భారత జలవనరుల కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి రాసిన లేఖలో పదే పదే ప్రస్తావించారని పేర్కొన్నాయి.
పాక్ లేఖలకు భారత్ ఎలాంటి అభిప్రాయాన్ని పంపలేదని తెలుస్తోంది. ఉగ్రవాదంపై పాకిస్థాన్ స్పష్టమైన వైఖరి తెలియజేసే వరకూ సింధూ జలాల ఒప్పందంపై నిలిపివేత కొనసాగుతుందని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఉగ్రవాదం సమస్య పరిష్కారం అయ్యే వరకు సింధూ జలాలపై పాకిస్థాన్‌తో చర్చలు ఉండబోవని తేల్చి చెప్పింది. సింధూ నది, దాని ఉపనదుల జలాలను పంచుకోవడానికి ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో భారత్, పాకిస్థాన్ మధ్య 1960లో సింధూ జలాల ఒప్పందం కుదిరింది.
ఈ ఒప్పందం ప్రకారం సింధూ ఉప నదుల్లో తూర్పున పారే రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్‌కు హక్కులు లభించాయి. సింధూ నదితోపాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలం, చీనాబ్‌లపై పాకిస్థాన్‌కు హక్కులు దక్కాయి. పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పేందుకు సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. దీంతో పాకిస్థాన్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. పలు డ్యామ్ల్లో నీటి మట్టం దారుణంగా పడిపోయింది.
దాదాపు డెడ్‌లెవల్‌కు చేరిందని పాక్ అధికారిక గణాంకాల ద్వారా వెల్లడైంది. వేసవిలో పంటలు ఎండి కష్టాల్లో పడిన పాక్ రైతులకు నీరు లేకపోవడంతో ఖరీఫ్ సీజన్‌లో మరిన్ని ఇక్కట్లు తప్పవని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సింధు నదీ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించాలని భారత్‌ను వేడుకుంటూ పాకిస్తాన్ ఇప్పటికే పలుమార్లు సార్లు లేఖలు రాసింది.
More Stories
2024లో తీవ్ర స్థాయికి బాలలపై హింస
కోయంబత్తూర్ కారు బాంబు కేసులో మరో నలుగురు అరెస్ట్
వీసాల అనిశ్చితతో అమెరికాలో చదువులపై వెనకడుగు!