తొక్కిసలాటపై ప్రభుత్వంకు హైకోర్టు 9 ప్రశ్నలు 

తొక్కిసలాటపై ప్రభుత్వంకు హైకోర్టు 9 ప్రశ్నలు 

ఎం. చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితులు, విధాన పరమైన లోపాల విషయంలో కర్ణాటక హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. తొక్కిసలాట కేసులో సుమోటోగా దాఖలైన పిటిషన్ ను విచారిస్తున్న హైకోర్టు ఈ కేసులో బాధ్యులు ఎవరని నిలదీసింది. జవాబుదారీ తనం కోరింది. విధానపరమైన లోపాలు, జన సమూహం నిర్వహణ, అనుమతులు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకున్న జాగ్రత్తలు సంబంధించి 9 ప్రశ్నలు సంధించింది. 

తమ ప్రశ్నలకు జవాబు సమర్పించాలని ఆదేశించింది. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు, 50 మందికిపైగా గాయపడ్డారు. ఆ తర్వాత జూన్ 5న హైకోర్టు ఈ ఘటనను సూమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ దుర్ఘటనకు కారణమేమిటో, భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలా నివారించాలో తేల్చాలని హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 

తొక్కిసలాట కేసు దర్యాప్తును సీఐడీకి బదిలీ చేసినట్లు కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. అయినా, బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఇంకా అరెస్ట్ లు చేస్తోంది. నిందితులను కబ్బన్ పార్క్ పోలీసు స్టేషన్ ముందు హాజరు పరుస్తున్నారు. కేసు బదిలీ గురించి కోర్టుకు తెలుపడంతో విధానపమైన తప్పుజరిగినట్లు అడ్వొకేట్ జనరల్ అంగీకరించారు.

కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు వేసిన ప్రశ్నలు.

1.విజయోత్సవ వేడుకను ఎప్పుడు, ఎవరు ఏ విధంగా నిర్వహించాలని నిర్ణయించారు?
2. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
3 .ప్రజలను క్రమబద్ధీకరించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
4. వేదిక వద్ద ఎలాంటి వైద్య ,ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశారు?
5. వేడుక సమయంలో ఎంత మంది ఉండవచ్చునని అంచనా వేశారా?
6.గాయపడిన వారికి వెంటనే వైద్య సహాయం అందించారా? లేకుంటే ఎందుకు?
7. గాయపడిన వారిని ఆసుపత్రులకు తీసుకెళ్లడానికి ఎంత సమయం పట్టింది?
8. ఈ తరహా క్రీడా కార్యక్రమం లేదా వేడుకలలో 50 వేలమందికంటే ఎక్కువ మంది వస్తే..
నిర్వహించడానికి ఏదైనా స్టాండర్డ్ ఆపరేటింగ్ పాలసీ ని రూపొందించారా?
9. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏదైనా అనుమతి కోరారా?

ఈ ప్రశ్నలకు సమాధానాలు దాఖలుకు రాష్ట్ర ప్రభుత్వం కొంత వ్యవధి కోరింది. సమాధానాలు సీల్ట్ కవర్ లో సమర్పించాలని భావిస్తున్నారు. నిందితులు తన అరెస్ట్ ల చట్టబద్ధతను సవాల్ చేసేందుకు యత్నిస్తున్నారని, దర్యాప్తు
సంస్థలు, అరెస్ట్ ఏజెన్సీల మధ్య వ్యత్యాసాన్ని నిలదీస్తున్నారని. అందువల్ల బహిరంగంగా కోర్టుకు మరిన్ని వివరాలు వెల్లడించలేమని ఏజీ కోర్టుకు నివేదించారు.

తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అధికారి నిఖిల్ సోసలే తన అరెస్ట్ చట్టవిరుద్ధమని కోర్టుకు తెలిపారు. కాగా, ఈవెంట్ నిర్వాహకుడు డిఎన్ ఏ ఎంటర్టేన్మెంట్ నెట్ వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ తన పిటిషన్ లో ముఖ్యమంత్రి అందరినీ సన్మాన సభకు ఆహ్వానించారని తెలిపారు. ఈ కేసులో అడ్వొకేట్ జనరల్ వ్యవధి కోరినందువల్ల, తదుపరి విచారణ తేదీ తర్వాత ప్రకటిస్తారు.