
* కొమ్మినేనికి 14 రోజుల రేమండ్
ఏపీ రాజధాని అమరావతి మహిళలపై సాక్షి ఛానల్ లో జర్నలిస్టులు చేసిన అసభ్య వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది. జర్నలిస్ట్ వీవీఆర్ కృష్ణంరాజు టీవీ డిబేట్ సందర్భంగా అమరావతిలోని మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది.
అమరావతిని ‘వేశ్యల రాజధాని’గా సంబోధించడం అనేది రాజధాని ఉద్యమంలో ముఖ్యపాత్ర పోషించిన మహిళా రైతులను తీవ్రంగా అవమానించడమేనని జాతీయ మహిళా కమిషన్ పేర్కొంది. ఈ అసహ్యకరమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలను తీవ్రంగా జాతీయ మహిళా కమిషన్ ఖండిస్తోందని ఛైర్‌పర్సన్ విజయా రహట్కర్ స్పష్టం చేశారు.
కాగా నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ లేఖ రాసింది. తక్షణమే నిర్దిష్ట కాలపరిమితిలో విచారణ జరిపి సంబంధిత చట్టాల ప్రకారం కృష్ణంరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో ఎన్‌సీడబ్ల్యూ ఆదేశించింది. మూడు రోజుల్లోగా కృష్ణంరాజుపై తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను పంపించాలని కూడా డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.
మరోవంక, రాజధాని అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యల కేసులో సోమవారం అరెస్ట్ చేసిన కొమ్మినేని శ్రీనివాసరావుకు కోర్డు 14 రోజులు రిమాండ్ విధించింది. ఈనెల 24 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తున్నట్లు మంగళగిరి కోర్టు పేర్కొంది. కొమ్మినేని శ్రీనివాసరావును గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఇదే కేసులో మరో నిందితుడు కృష్ణంరాజు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.
కొమ్మినేనిని సోమవారం హైదరాబాద్‌లో తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి విజయవాడ మీదుగా గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తరలించారు. నేడు తొలుత గుంటూరు జీజీహెచ్‌లో వైద్య పరీక్షల అనంతరం పోలీసులు కొమ్మినేనిని కోర్టుకు తీసుకువచ్చారు.
కాగా తనకు గుండెల్లో అలజడిగా ఉందని, మూత్రసమస్యలు ఉన్నాయని కొమ్మినేని వైద్యులకు చెప్పారు. దీంతో గుండెకు సంబంధించి 2డి ఎకో పరీక్ష కూడా చేశారు. పరీక్షల్లో అంతా బాగానే ఉన్నట్లు తేలింది. మూత్రపిండాల వైద్య నిపుణులు అల్ట్రాసౌండ్ స్కానింగ్ నిర్వహించారు. మూత్రనాళంలో ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారు. ఇన్‌ఫెక్షన్ తగ్గేందుకు అవసరమైన మందులు అందజేశారు.
More Stories
యోగా మానవతను పెంచే సామూహిక పక్రియ.. మోదీ
యోగా దినోత్సవంకు ముస్తాబవుతున్న విశాఖ
గోదావరి జలాలపై కలిసి మాట్లాడుకొందాం