
అమరావతి మహిళలను కించపరిచిన కేసులో సాక్షి ఛానల్‌కు చెందిన కొమ్మినేని శ్రీనివాస్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో కొమ్మినేనిని అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడకు తరలిస్తున్నారు. కృష్ణంరాజు, కొమ్మినేనితో పాటు సాక్షి యాజమాన్యంపైనా ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ సహా ఇతర సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
సాక్షి ఛానల్‌లో కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించే చర్చా కార్యక్రమంలో పాత్రికేయుడు కృష్ణంరాజు అమరావతి మహిళలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అమరావతి దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఖండించకుండా, కొమ్మినేని శ్రీనివాసరావు చర్చను కొనసాగించారు. కృష్ణంరాజు వ్యాఖ్యలను కానీ, కొమ్మినేని తీరును ఖండిస్తూ కానీ, సాక్షి యాజమాన్యం సరైన వివరణ ఇవ్వలేదు.
ఈ క్రమంలో అమరావతి మహిళలు, ప్రజాసంఘాలు, పాత్రికేయ సంఘాలు కూడా పోలీసులకు అనేక మంది ఫిర్యాదులు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణంరాజును పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. సోమవారం ఉదయం ఏపీ పోలీసులు కొమ్మినేని శ్రీనివాసరావు నివాసానికి మఫ్టీలో వెళ్లారు. ఈ సందర్భంగా ముందస్తు నోటీసులు, సెర్చ్ వారెంట్ లేకుండా ఇంటికి వచ్చారని కొమ్మినేని ప్రశ్నించగా ఎఫ్‌ఐఆర్ నమోదైనట్లు చెప్పారు.
కేసు ఏంటని అడిగితే మాత్రం పోలీసులు సమాధానమివ్వలేదు. అలాగే ఆయన్ను అదుపులోకి తీసుకొని ఏపీకి తరలించారు. ఈ క్రమంలో కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ రెడ్‌బుక్ తన వరకూ వచ్చిందని తెలిపారు. `నేను సీనియర్ జర్నలిస్టును.. ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించాను. సీనియర్ జర్నలిస్టులకే ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటి?’ అని ఆయన నిలదీశారు. కేసు ఎవరు పెట్టారో చెప్పడం లేదని, ప్రభుత్వ వ్యతిరేక గొంతుక వినిపించకుండా చేసే యత్నం చేస్తున్నారని విమర్సించారు. .
కాగా, అమరావతి మహిళలపై సాక్షి మీడియాలో ప్రసారమైన వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మీడియాలో రాజధాని ప్రాంత మహిళలను కించపరిచేలా మాట్లాడారని, మహిళల ఆత్మాభిమానాలపై దాడి చేయడం గత ఐదేళ్లుగా సాధారణం అయ్యిందని, మహిళలను రాజకీయ ముసుగులో కొన్ని మీడియా ఛానళ్లు తిట్టిస్తున్నాయని, ప్రభుత్వం మారినా మహిళలను తిట్టించే సంస్కృతి మారలేదని ఆమె మండిపడ్డారు. రాజకీయ ముసుగులో నడిపే ఇటువంటి చానల్స్‌ను పూర్తిగా రద్దు చేయాలని శైలజ డిమాండ్ చేశారు.
ప్రెస్ కౌన్సిల్‌కు కూడా సాక్షిపై లెటర్ రాస్తామని, ఆ ఛానల్ లైసెన్స్ రద్దు చేయాలని కోరతామని ఆమె చెప్పారు. రాజకీయ పార్టీలు ఛానల్స్, ఆయా యాజమాన్యాలు రాజకీయంగా విమర్శించుకోవాలని, అనవసర విషయాల్లో మహిళలను కించ పరిస్తే ఊరుకోమని ఆమె హెచ్చరించారు.
More Stories
యోగా మానవతను పెంచే సామూహిక పక్రియ.. మోదీ
యోగా దినోత్సవంకు ముస్తాబవుతున్న విశాఖ
గోదావరి జలాలపై కలిసి మాట్లాడుకొందాం