అమరావతి మహిళలపై జుగుప్సాకర వ్యాఖ్యలు దారుణం

అమరావతి మహిళలపై జుగుప్సాకర వ్యాఖ్యలు దారుణం
అమరావతి మహిళలపై ఇటువంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు అత్యంత దారుణమైనవని సాక్షి టివిలో ప్రసారం చేసిన వాఖ్యలపై మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇందుకు బాధ్యులైన ప్రతి ఒక్కరి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి’ అని ఆయన డిమాండ్ చేస్తూ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

“ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతుల గురించి కొందరు నోళ్లు పారేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు అత్యంత దారుణమైనవి, హేయమైనవి. సభ్యసమాజం సహించలేనివి. కేవలం ఒక్క ఎకరా భూమి ఉన్న రైతులు సైతం రాజధాని కోసం భూములు ఇవ్వడమే గాక, తదనంతర కాలంలో తమ మీద జరిగిన దమనకాండకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేశారు” అని పేర్కొన్నారు. 

“అమరావతి ప్రాంతంలో వ్యవసాయమే ప్రధాన వృత్తిగా, ప్రవృత్తిగా జీవనం సాగిస్తూ భవిష్యత్ తరాల కోసం వారు చేసిన త్యాగాలు నిరుపమానమైనవి. అలాంటి రైతులను, ముఖ్యంగా మహిళా మూర్తులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కిరాతకమైనవి. ఆడబిడ్డల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం క్షమించరాని నేరం. ఇందుకు బాధ్యులైన ప్రతి ఒక్కరి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి” అని స్పష్టం చేశారు.

కాగా, మహిళల వ్యక్తిత్వంపై దాడిని ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాజకీయ, మీడియా ముసుగులో స్త్రీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వారిపై అత్యంత కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాజధాని ప్రాంత మహిళలపై వికృత వ్యాఖలను ఆయన ఖండించారు. మరోవైపు రాజధాని మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన జర్నలిస్ట్ కృష్ణంరాజు, సాక్షి చానల్ మోడరేటర్ కొమ్మినేని శ్రీనివాస్‌రావు, ఆ చానల్ యాజమాన్యంలపై గుంటూరు జిల్లాలోని తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం రాజధాని మహిళలు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.

ఐటీ చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ చట్టం, ఇతర నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాస్‌రావులను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. రెండు రోజుల నుంచి విజయవాడలో ఇంటికి తాళం వేసి కుటంబంతో సహా కృష్ణంరాజు పరారయ్యాడు. కొమ్మినేని కోసం హైదరాబాద్‌కి విజయవాడ, గుంటూరు జిల్లాల నుంచి ప్రత్యేక పోలీస్ బృందాలు వెళ్లాయి. స్థానిక తెలుగు మహిళల ఫిర్యాదు మేరకు విజయవాడలోని పటమట పోలీసులు కూడా మరో కేసును నమోదు చేశారు.