
భారత్‌లోని కీలక సైనికస్థావరాలను ధ్వంసం చేశామని పాకిస్థాన్ ప్రగల్భాలు పలుకుతుంది. పంజాబ్‌లోని ఆదంపూర్ ఎయిర్‌బేస్‌లో సుఖోయ్ -30ఎంకేఐ యుద్ధవిమానాన్ని ధ్వంసం చేశామని, గుజరాత్‌లోని భుజ్ ఎయిర్‌ఫీల్డ్‌లో ఉన్న ఎస్-400 యూనిట్‌ను కూల్చివేశామని చెబుతోంది. అయితే, ఇవన్నీ బూటకమే అని ఇప్పటికే భారత్ చెప్పింది. తాజాగా, ప్రముఖ ఇమేజరీ అనలిస్ట్ డమియెన్ సైమన్ ‘ఎక్స్’లో పోస్టు చేసిన శాటిలైట్ చిత్రాలు పాకిస్థాన్‌వి ఉత్తర ప్రగల్బాలేనని మరోసారి నిరూపించాయి.
ప్రముఖ ఇమేజరీ అనలిస్ట్ డమియెన్ సైమన్ ‘ఎక్స్’లో పోస్టు చేసిన శాటిలైట్ చిత్రాలు పాకిస్థాన్‌వి ఒట్టి అబద్దాలేనని మరోసారి నిరూపించాయి. పాక్ స్థావరాలకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను డమియెన్ ఎక్స్ వేదికగా విడుదల చేశారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్ బలగాలు చేసిన దాడుల్లో పాక్‌కు భారీ నష్టం జరిగినట్లు ఆ చిత్రాల్లో కనిపిస్తోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. గంటల వ్యవధిలోనే ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది. తరువాత ప్రతీకారదాడులకు దిగిన పాకిస్థాన్‌ను చావుదెబ్బ కొట్టింది.
అయితే, ఆపరేషన్ సిందూర్ తమపై పెద్దగా ప్రభావం చూపలేదని ప్రపంచ దేశాలను పాకిస్థాన్ నమ్మించే ప్రయత్నం చేసింది. భుజ్ ఎయిర్‌బేస్‌లోని ఎస్-400 రేడార్ సిస్టమ్‌ను కుప్పకూల్చినట్లు పాకిస్థాన్ విపరీతమైన ప్రచారం చేసింది. తమ వాదనలకు బలం చేకూరుస్తూ ఓ ఫొటోను కూడా విడుదల చేసింది. ఎయిర్‌బేస్‌లో అక్కడక్కడా నల్లటి మచ్చలు చూపిస్తూ, అందర్నీ నమ్మించే ప్రయత్నం చేసింది.
అయితే, అవి ఇంధనపు మరకలని రివ్యూలో తేలింది. ఎస్-400 అనేది సంచార క్షిపణి వ్యవస్థ. ఒక చోట నుంచి మరో చోటకి తరలించవచ్చు. అలా క్షిపణి వాహనాన్ని తరలిస్తున్నప్పుడు, దాని నుంచి ఇంధనం లీకై అలా మచ్చలు ఏర్పడినట్లు తేలింది. అంతేకాకుండా భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు చెలరేగడానికి ముందే ఆ చిత్రం తీసినట్లు స్పష్టమైంది.
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్‌లోని ఆదంపుర్ ఎయిర్ బేస్‌పై దాడి చేసి ఎస్-400పై దాడి చేశామంటూ తప్పుడు ప్రచారం చేసింది. అక్కడి ఫొటోను పూర్తిగా మార్ఫింగ్ చేసి భారత్ కీలక స్థావరాన్ని ధ్వంసం చేశామని గొప్పలు చెప్పుకొంది. దీనిని తిప్పికొట్టేలా అక్కడికి రోజుల వ్యధిలోనే ప్రధాని మోదీ నేరుగా ఆదంపుర్ ఎయిర్ బేస్‌కు వెళ్లి సైనికులతో భేటీ అయ్యారు.
ఎస్-400 ఎదుట సగర్వంగా నిలబడి ప్రధాని ఫొటో దిగారు. ఎస్-400, మిగ్-29లు సురక్షితమే అని ప్రపంచానికి చూపారు. దీంతో పాక్ పరువు పోయింది. ఆదంపూర్ ఎయిర్‌బేస్‌లో సుఖోయ్ విమానాన్ని ధ్వంసం చేశామంటూ ఇటీవల పాకిస్థాన్ ఓ చిత్రాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, అది ఆపరేషన్ సిందూర్ కంటే ముందే తీసిన చిత్రమని రివ్యూలో తేలింది.
అసలు అది సుఖోయ్ యుద్ధవిమానమే కాదు. రోజువారీ మెయింటెనెన్స్‌లో భాగంగా ఎంఐజీ-29 ఇంజిన్‌ను శుభ్రం చేస్తున్నప్పటి చిత్రమది. దానిని తనకు అనుకూలంగా మలచుకునేందుకు పాక్ శాయశక్తులా ప్రయత్నించి విఫలమైంది. పాక్ నలియా ఎయిర్బేస్పై దాడి చేసినట్లు ఓ చిత్రాన్ని చూపించింది. అందులో ఉన్నది ఓ నల్లని మేఘం. అంతేకానీ బాంబు దాడి వల్ల ఏర్పడిన నష్టం కాదు అని శాటిలైట్ చిత్రాలు స్ఫష్టం చేస్తున్నాయి.
పాక్ శ్రీనగర్ విమానాశ్రయంపై దాడి చేసినట్లు చెప్పుకుంది. ఇందుకు నిరూపణగా ఓ మసకబారిన చిత్రాన్ని చూపించింది. అయితే అది ఫేక్ ఫొటో అని తేలింది. ఆదంపూర్పై పాక్ విజయవంతంగా దాడి చేసిందంటూ చైనా కొన్ని ఉపగ్రహ చిత్రాలు విడుదల చేసింది. అయితే అవన్నీ భారత్-పాక్ ఘర్షణ కంటే చాలా కాలం ముందట తీసినవి. వాటిని కాస్త మార్ఫ్ చేసి చైనా నకిలీ చిత్రాలు చూపించింది. జమ్మూ విమానాశ్రయ రన్‌వే పై కనిపించిన మచ్చలు కూడా నకిలీవి. హై రిజల్యూషన్ చిత్రాలను చూస్తే, అక్కడ ఎలాంటి విధ్వంసం జరగలేదని స్పష్టంగా తెలుస్తోంది.
కానీ భారత్ చేసిన దాడిలో పాక్ వైమానికి స్థావరాలు భారీగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా జకోబాబాద్, భోలారి వైమానిక స్థావరాలపై భారత్ దాడి చేసింది. దీనితో అక్కడ జరిగిన నష్టాన్ని కవర్ చేయడానికి టార్పాలిన్ షీట్లను కప్పింది పాకిస్థాన్. బహుశా ఇప్పుడు అక్కడ మరమ్మత్తు కార్యకలాపాలు చేస్తుండవచ్చని డమియెన్ సైమన్ పోస్ట్ చేసిన శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుస్తోంది.
More Stories
ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధంలో ఏకాకిగా ఇరాన్
ఇరాన్ గగనతలాన్ని తెరవడంతో 290 మంది రాక
స్విస్ బ్యాంకుల్లో 18 శాతం తగ్గిన భారతీయుల డిపాజిట్లు