
మహారాష్ట్ర ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ లోక్‌సభా విపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ సామాజిక మాధ్యమాల్లో చేసిన ఆరోపణలపై ఎన్నికల కమిషన్ స్పందించింది. లిఖిత పూర్వకంగా ఆయన ఫిర్యాదు చేస్తేనే ఎన్నికల కమిషన్ స్పందించగదలని కమిషన్ వర్గాలు ఆదివారం నాడు తెలిపాయి.
ఎన్నికల అనంతరం మేలో ఆరు జాతీయ పార్టీలతో వేర్వేరుగా ఎన్నికల కమిషన్ సమావేశాలు జరిపిందని, మిగిలిన ఐదు పార్టీలు ఇసి ఉన్నతాధికారులతో సమావేశమవగా, షెడ్యూల్ ప్రకారం మే 15న కాంగ్రెస్ పార్టీతో సమావేశం ఉండగా ఆ సమావేశాన్ని కాంగ్రెస్ రద్దు చేసుకున్నట్లు వివరించాయి. ఎన్నికల కమిషన్‌పై రాహుల్ గాంధీ శనివారం నాడు విమర్శలు ఎక్కుపెడుతూ తీవ్రమైన అంశాలపై ఈసీ జవాబులు దాటవేస్తోందని ఆరోపించారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో మ్యాచ్-ఫిక్సింగ్ జరిగిందని, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే పునరావృతం కావచ్చని పేర్కొన్నారు. మహారాష్ట్రతో సహా ఇటీవల అన్ని రాష్ట్రాల్లో జరిగిన లోక్‌సభ, విధానసభల సమగ్రమైన డిజిటల్, మెషీన్-రీడబుల్ ఓటర్ల జాబితాను ప్రచురించాలని, మహారాష్ట్ర పోలింగ్ బూత్‌ల్లోని సాయంత్రం 5 గంటల తర్వాత సీసీటీవీ ఫుటేజ్‌ను విడుదల చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు.
మహారాష్ట్రలోని పోలింగ్ స్టేషన్లలో సాయంత్రం వేళ తీసిన సీసీటీవీ ఫుటేజ్ మాయమైందంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఈసీ వర్గాలు స్పందించాయి. ఈసీ ప్రోటోకాల్ ప్రకారం వాటిని భద్రపరుస్తారని, ఎన్నికల కమిషన్ సూచనల ప్రకారం ఎన్నికల పిటిషన్ దాఖలు చేసినపుడు, పోలింగ్ కేంద్రాల సిసిటివి ఫుటేజీలను హైకోర్టు ఎల్లప్పుడూ పరిశీలించవచ్చని ఆ వర్గాలు తెలిపాయి.
ఓటర్ల గోప్యతను కాపాడటానికి, ఎన్నికల సమగ్రతను కాపాడానికి ఇసి యత్నిస్తుందని, ఓటర్ల గోప్యతపై రాహుల్ గాంధీ దాడి చేయాలనుకుంటున్నారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఆయన హైకోర్టులను విశ్వసించాలని తెలిపాయి. “ఎన్నికల ప్రక్రియ సమగ్రత, ఓటర్ల ప్రైవసీ దృష్ట్యా ఇదంతా జరుగుతుంది. ఓటర్ల ప్రైవసీపై దాడి చేయాలని రాహుల్ గాంధీ ఎందుకనుకుంటున్నారు?. ఎలక్టోరల్ చట్టాలను పరిరక్షించడం ఈసీ బాధ్యత” అని సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. రిగ్గింగ్ ఆరోపణలపై చట్టపరమైన మార్గాలను అనుసరించవచ్చనీ ఆయన సూచించారు.
More Stories
ఇరాన్ గగనతలాన్ని తెరవడంతో 290 మంది రాక
అస్సాంలో 5000 విదేశీ ఫేస్బుక్ ఖాతాలు యాక్టివ్
కాంగ్రెస్, ఆర్జేడీలకు కుటుంబ రాజకీయాలే ముఖ్యం