ట్రంప్ ‘బ్యూటిఫుల్‌’ బిల్లుతో భారత్‌కు బిలియన్ల డాలర్ల నష్టం

ట్రంప్ ‘బ్యూటిఫుల్‌’ బిల్లుతో భారత్‌కు బిలియన్ల డాలర్ల నష్టం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకొచ్చిన వన్‌ బిగ్‌ బ్యూటిఫుల్‌  బిల్లులో ప్రతిపాదించిన రెమిటెన్స్‌ ట్యాక్స్‌తో అమెరికాలో నివసిస్తున్న విదేశీయులపై భారం పడనుంది. అమెరికాలో ఉంటున్న భారత్ సహా అనేక దేశాల ప్రవాసులు తమ స్వదేశానికి చేస్తున్న నగదు బదిలీపై 3.5 శాతం పన్ను విధించేలా రెమిటెన్స్‌ ట్యాక్స్‌ ప్రతిపాదించారు. తొలుత 5 శాతం పన్ను విధించాలని ప్రతిపాదించిన తర్వాత 3.5 శాతానికి తగ్గించారు. 

విదేశీయులు సహా హెచ్‌-1బీ, గ్రీన్‌ కార్డుదారులు బదిలీ చేసే నగదుపై ఈ పన్ను వర్తించనుంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే భారత్‌తో పాటు పలు దేశాలపై ప్రభావం చూపనుంది. ప్రధానంగా లక్షలాది మంది భారతీయులపై ప్రభావం చూపనుంది. ఈ వన్‌ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్‌ అమెరికా హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో 215-214 స్వల్ప ఓట్ల తేడాతో నెగ్గింది. 

సెనెట్‌లో ఈ బిల్లు ఇంకా ఆమోదం పొందాల్సి ఉంది. జులై 4వ తేదీన ఈ బిల్లును చట్టంగా మార్చాలని నిర్ణయించుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవలే తెలిపారు. 2024లో రెమిటెన్స్‌ రూపంలో భారత్‌కు 129 బిలియన్ల యూఎస్‌ డాలర్లు వచ్చినట్లు ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. ఇది పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ రెండు దేశాల వార్షిక బడ్జెట్‌లకు దాదాపు సమానం. 

భారత్‌కు బదిలీ అయ్యే మొత్తంలో సగానికిపైగా అభివృద్ధి చెందిన దేశాలనుంచే వస్తోంది. ఈ రెమిటెన్స్‌లో అత్యధిక భాగం అమెరికాలో ఉంటోన్న భారతీయుల నుంచే వస్తోంది. అమెరికా నుంచి భారత్‌కు అందుతున్న రెమిటెన్స్‌లు 2010లో 55.6 బిలియన్‌ డాలర్లుగా ఉండగా 2023-24కు 118.7 బి.డాలర్లకు పెరిగినట్లు RBI గణాంకాలు వెల్లడించాయి. ప్రతిపాదిత బిల్లు అమల్లోకి వస్తే భారత్‌కు వచ్చే రెమిటెన్స్‌ భారీగా తగ్గవచ్చు. 

గత పదేళ్లలో భారతకు అందుతున్న రెమిటెన్స్‌లు 57 శాతానికి పెరిగాయి. 2014 నుంచి 2024 మధ్య కాలంలో దాదాపు ఒక ట్రిలియన్‌ యూఎస్‌ డాలర్లు రెమిటెన్స్‌ రూపంలో భారత్‌లోకి వచ్చాయి. రెమిటెన్స్‌ అందుకుంటున్న రాష్ట్రాల్లో కేరళ, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌ అగ్రస్థానంలో ఉన్నాయి. భారత్‌ నుంచి వలస వెళుతున్న వారి సంఖ్య నానాటీకి పెరిగిపోతోంది. 

1990లో 6.6 మిలియన్ల మంది ఇతర దేశాలకు వలస పోతే. అది 2024 నాటికి 18 మిలియన్లకు పెరిగింది. ఇందులో గల్ఫ్‌ దేశాలకు ఎక్కువ మంది వలసదారులు ఉండగా అమెరికాలో కూడా గణనీయమైన సంఖ్యలో భారతీయ పౌరులు ఉన్నారు.  అక్కడి భారతీయుల్లో 78 శాతం మంది ఎక్కువ జీతాలు అందుకుంటున్న ఉద్యోగాలు చేస్తున్నారు. వీరి వల్ల భారత్‌కు వచ్చే రెమిటెన్స్‌లు గణనీయంగా పెరిగాయి. కాబట్టి ట్రంప్‌ సర్కార్‌ ప్రతిపాదించిన బిల్లు అమల్లోకి వస్తే భారత్‌ బిలియన్ల డాలర్లును కోల్పోయే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.