
న్యాయపరమైన నిర్ణయాలను తీసుకునే క్రమంలో దోహదపడే ఉపకరణంగా సాంకేతికత ఉండాలే తప్ప, మనిషి మెదడు స్థానాన్ని భర్తీ చేసే పరిస్థితి రాకూడదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ స్పష్టం చేశారు. విచక్షణ, ఇతరుల స్థితిని అర్థం చేసుకునే తత్వం, న్యాయపరమైన వివరణ వంటి విలువైన లక్షణాలను మరేదీ భర్తీ చేయలేదని తేల్చి చెప్పారు.
“భారత న్యాయ వ్యవస్థలో సాంకేతికత పాత్ర” అనే అంశంపై లండన్ విశ్వవిద్యాలయంలోని ‘స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్’ లో సీజేఐ బీఆర్ గవాయ్ శనివారం కీలకోపన్యాసం చేస్తూ ఆటోమేటెడ్ కాజ్ లిస్ట్‌లు, డిజిటల్ కియోస్క్‌లు, వర్చువల్ అసిస్టెంట్ల వంటి ఆవిష్కరణలను న్యాయవ్యవస్థ స్వాగతిస్తున్నప్పటికీ, మానవ పర్యవేక్షణ, నైతిక మార్గదర్శకాలు, బలమైన శిక్షణలను వాటి అమలులో అంతర్భాగంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు.
రాజ్యాంగపరమైన, సామాజికపరమైన వాస్తవికతలకు అనుగుణంగా దేశ అవసరాలను తీర్చేలా నైతిక వ్యవస్థలకు రూపకల్పన చేయగలిగే స్థితిలో భారత న్యాయ వ్యవస్థ ఉందని తెలిపారు. సమానత్వం, గౌరవం, న్యాయం అనే విలువలను ప్రతిబింబించేలా వ్యవస్థలను నిర్మించగలిగే సాంకేతిక నైపుణ్యం, న్యాయపరమైన దూరదృష్టి, ప్రజాస్వామిక ప్రభుత్వం భారత్‌కు ఉన్నాయని సీజేఐ పేర్కొన్నారు.
“సీజేఐగా బాధ్యతలు చేపట్టిన మొదటి వారంలోనే నేను సుప్రీంకోర్టుకు చెందిన సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ప్లానింగ్ విభాగంతో సమావేశమయ్యాను. ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ), అధునాతన సాంకేతికతలను దేశ న్యాయవ్యవస్థలో నైతిక రీతిలో ఎలా వినియోగించొచ్చు అనే దానిపై సమగ్ర నివేదికను రూపొందించమని నిర్దేశించాను” అని ఆయన గుర్తుచేశారు.
“విశ్వాసం, పారదర్శకతలను మరింతగా పెంచుకునేందుకు టెక్నాలజీని వాడేలా తప్ప, న్యాయ నిర్ణయాలు తీసుకునే క్రమంలో మానవ మనస్సాక్షిని అది భర్తీ చేయకూడదు” అని సీజేఐ బీఆర్ గవాయ్ చెప్పారు. “కేసుల మేనేజ్‌మెంట్ నుంచి లీగల్ రీసెర్చ్, డాక్యుమెంట్ ట్రాన్స్‌లేషన్, ప్రెడిక్టివ్ అనలిటిక్స్ దాకా ప్రతీచోటా ఏఐ టూల్స్ వినియోగం పెరిగింది. టెక్నాలజీని న్యాయవ్యవస్థ అందిపుచ్చుకుంటోంది. అయితే ఈ సాంకేతికతను వినియోగించే క్రమంలో, అది అందించే సమాచారంపై ఆధారపడే సందర్భాల్లో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి” అని ఆయన సూచించారు.
“న్యాయ వ్యవస్థల్లో ఏఐ నైతిక వినియోగంపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే అల్గారిథమిక్ బయాస్, తప్పుడు సమాచారం, డాటా మానిప్యులేషన్, విశ్వసనీయతకు భంగపాటు వంటి అంశాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి” అని తెలిపారు.
ఉదాహరణకు ఒక క్రైమ్ కేసులోని బాధిత వ్యక్తి వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి లీక్ కాకూడదు. ఏఐ ఎర్రర్ వల్లనో, తప్పుడు ప్రొటోకాల్స్ వల్లనో ఆ సమాచారం లీకైతే ప్రమాదం. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఏఐ టూల్స్ కల్పిత సమాచారాన్ని, ఏకపక్ష సూచనలను ఇచ్చినట్లు ఇటీవలే పలు కేసుల్లో వెల్లడి కావడం గమనార్హం” అని జస్టిస్ బీఆర్ గవాయ్ వివరించారు.
భాష, ప్రాంతం, ఆదాయం, డిజిటల్ అక్షరాస్యతలతో సంబంధం లేకుండా దేశంలోని ప్రతీ పౌరుడికి న్యాయం దొరకాలి అనేది తమ అంతిమ లక్ష్యమని చెబుతూ న్యాయ వ్యవస్థలో సాంకేతికతను వినియోగించినా, అది ప్రజలకు ఉపయోగపడేలా, నైతికతకు భంగం కలిగించని రీతిలో ఉండాలని పేర్కొన్నారు. ఇందుకోసం లా స్కూళ్లు, పౌర సమాజం, న్యాయసేవా సంస్థలు, ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయాలని సీజేఐ పిలుపునిచ్చారు.
More Stories
పాక్ వైమానిక, సైనిక స్థావరాలపై ట్రంప్ కన్ను!
ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధంలో ఏకాకిగా ఇరాన్
స్విస్ బ్యాంకుల్లో 18 శాతం తగ్గిన భారతీయుల డిపాజిట్లు