
* ప్రెస్ అకాడమీ చైర్మన్ సురేష్ జోక్యంకై జాప్ డిమాండ్
`అమరావతి దేవతల రాజధాని కాదు అది వేశ్యల రాజధాని’ అంటూ సాక్షి ఛానల్‌లో ఓ డిబేట్ సందర్భంగా వాఖ్యానించడంపై తుళ్లూరులో రాజధాని రైతులు, మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి ఛానల్‌లో వైసీపీ నేతలు పని గట్టుకుని అమరావతిపై విష ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. విష ప్రచారంపై కార్యాచరణ కోసం శనివారం రైతులు, మహిళలు సమావేశమయ్యారు.
ఆ వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణంరాజు, ఇటువంటి చర్చ పెట్టినందుకు కొమ్మినేని శ్రీనివాసరావులతో పాటు అటువంటి వ్యాఖ్యలు ప్రసారం చేసినందుకు సాక్షి యాజమాన్యం మీద చట్టపరంగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా తుళ్లూరు ఉద్యమ శిబిరం నుంచి పోలీస్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు.
ఆపై పోలీస్టేషన్‌లో కృష్ణంరాజు, సాక్షిపై ఫిర్యాదు చేశారు. రాజధాని ప్రాంత మహిళలను అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అమరావతి రైతులు, మహిళలపై విషం చిమ్ముతారా? సెక్స్ వర్కర్లు, వేశ్యలు అని నీచంగా మాట్లాడతారా? మ మ్మల్ని వేశ్యలు అంటారా? ఎయిడ్స్ కేంద్రాలు ఉన్నాయని అంటారా? అంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమం ప్రసారం చేసినందుకు సాక్షి యజమాని వైఎస్ భారతీ రెడ్డి తమకు క్షమాపణ చెప్పాలని, మాధ్యమాల్లో నుంచి ఆ వీడియోను తొలగించాలని డిమాండ్ చేశారు. 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే సాక్షి కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. పోలీసులు కృష్ణంరాజుపై, కొమ్మినేనిపై చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ లేదంటే మళ్ళీ అమరావతి నుంచి మరో ఉద్యమం మొదలవుతుందని స్పష్టం చేశారు.
అమరావతి రాజధాని ఆ ప్రాంత మహిళలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు సాక్షి ఛానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు, పాత్రికేయుడు కృష్ణంరాజులపై కేసు నమోదు చేయాలని కోరుతూ శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు డీజీపీకి లేఖ రాశారు. మహిళలపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని, పరువుకు భంగం కలిగించేలా మాట్లాడారని విచారం వ్యక్తం చేశారు. చర్చలో చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవే కాకుండా పూర్తి అవమానకరంగా ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే అభ్యంతరకరమైన వ్యాఖ్యలను సంపాదకీయ పరిమితి లేకుండా యథాతథంగా ప్రసారం చేసేందుకు అనుమతించిన సాక్షి టీవీ యాజమాన్యం, యాంకర్ ఇద్దరూ మహిళల గౌరవానికి భంగం కలిగించారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, సాక్షి టీవీ లో డిబేట్ లో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు పైన, అయన వ్యాఖ్యలను అనుమతించిన యాంకర్ కే శ్రీనివాసరావు లపైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ఉద్యమస్తున్న అమరావతి మహిళలకు అండగా ఉంటూ వారికీ నాయకత్వం వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ ను జర్నలిస్ట్స్ అసోసియేషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) డిమాండ్ చేసింది.
అమరావతి ఉద్యమం జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నుంచి అయన చైర్మన్ పదవి పొందారని పేర్కొంటూ ఆ అయన పూర్తి భాద్యత వహించి అమరావతి మహిళలకు పూర్తి మద్దతుగా ఉద్యమం చేయాలని కోరారు.
ఈ విషయములో పూర్తి గా సహకరిస్తుందని జాప్ అధ్యక్షుడు ఎ రవితేజ, ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. అమరావతి మహిళలు ఎక్కువశా తము అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉంటారని బాధ్యత గల జర్నలిస్ట్ లే చర్చలు నిర్వహించడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఈ విషయములో మహిళ అయినా హోంమంత్రి వెంటనే స్పందించాలని కోరారు.
More Stories
యోగా మానవతను పెంచే సామూహిక పక్రియ.. మోదీ
ఇజ్రాయెల్తో జరుగుతున్న యుద్ధంలో ఏకాకిగా ఇరాన్
స్విస్ బ్యాంకుల్లో 18 శాతం తగ్గిన భారతీయుల డిపాజిట్లు