భారతదేశంలో ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ సేవలకు లైసెన్స్

భారతదేశంలో ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ సేవలకు లైసెన్స్

దేశంలో ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్టార్‌లింక్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ లైసెన్స్ జారీ చేసింది. కంపెనీ దరఖాస్తు చేసుకున్న 15 నుంచి 20 రోజుల్లోగా ట్రయల్‌ స్పెక్ట్రమ్‌ను మంజూరు చేస్తామని డాట్‌ వర్గాలు తెలిపాయి. డాట్ నుంచి లైసెన్స్‌ పొందిన మూడో కంపెనీగా స్టార్‌లింక్‌ నిలిచింది. గతంలో వన్‌వెబ్‌, రిలయన్స్ జియోలకు డాట్‌ లైసెన్స్‌లు జారీ చేసింది.

అయితే ఇప్పటివరకు ఆ సంస్థలు కార్యకలాపాలను ప్రారంభించలేదు. ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ అనుబంధ సంస్థ అయిన స్టార్‌లింక్‌ వివిధ దేశాల్లో ఇంటర్నెట్ సర్వీసులను అందిస్తోంది. సుదూర భూస్థిర ఉపగ్రహాలపై ఆధారపడే సంప్రదాయ ఉపగ్రహ సేవల మాదిరిగా కాకుండా లియో (లో ఎర్త్‌ ఆర్బిట్‌) ఉపగ్రహాల ద్వారా స్టార్‌ లింక్‌ ఈ ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. భూమికి 550 కిలోమీటర్లు ఎత్తులో ఉండే కక్ష్యలో స్టార్‌లింక్‌కు చెందిన 6,000 శాటిలైట్లు తిరుగుతుంటాయి. 

స్పేస్‌ఎక్స్ తన శాటిలైట్ ఇంటర్నెట్ ప్రాజెక్టును జనవరి 2015లో ప్రకటించగా, ఇప్పటికే 100కు పైగా దేశాల్లో ఈ సేవలు లభిస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం లైసెన్స్ జారీ చేయడంతో త్వరలో భారత్‌ కూడా ఈ జాబితాలో చేరనుంది. భూమి నుంచి ఈ ఉపగ్రహాలు తక్కువ దూరంలో ఉండడం వల్ల తక్కువ లేటెన్సీతో ఇంటర్నెట్‌ సేవలను పొందవచ్చు. స్టార్‌లింక్‌తో భాగస్వామ్యం ద్వారా జియో, ఎయిర్‌టెల్ భారతదేశంలోని సాధారణ నెట్‌వర్క్‌లు చేరుకోలేని ప్రాంతాలకు టెలికాం సేవలు అందుతాయి. 

ముఖ్యంగా మారుమూల ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలందించేందుకు స్టార్‌ లింక్‌ ఉపయోగపడుతుంది. ఇది సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా వ్యాపారాలపై కూడా భారీ ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశ ఆర్థికాభివృద్ధికి, డిజిటలైజేషన్‌కు ఈ ప్రయత్నం ముఖ్యమైన అడుగుగా మారనున్నట్లు చెబుతున్నారు.

స్టార్‌లింక్ ఇటీవల బంగ్లాదేశ్‌లో తన సేవలను ప్రారంభించింది. ఇందులో నెలకు సుమారు రూ. 3,000 విలువైన ఇంటర్నెట్, ఒకసారి తీసుకునే హార్డ్‌వేర్ ఖర్చు రూ. 33,000. అయితే, భారత్‌లో ఈ కంపెనీ మరింత తక్కువ ధరతో ప్లాన్లను ప్రకటించే అవకాశం ఉంది. 

విశ్లేషకుల ప్రకారం స్టార్‌లింక్ 10 డాలర్ల (సుమారు రూ. 840) కింద ఒక ప్రమోషనల్ ధరతో అన్ లిమిటెడ్ డేటా ప్లాన్లను అందించనుంది. దీని ద్వారా కంపెనీ తన వినియోగదారుల బేస్‌ను త్వరగా పెంచుకోవాలని, 10 మిలియన్ సభ్యులను లక్ష్యంగా పెట్టుకుని, ఇంటర్నెట్‌ సేవలను అందించాలని చూస్తోంది. ఈ సంస్థ 2021 నుంచి భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది.