రెపో రేటు 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఆర్బీఐ

రెపో రేటు 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఆర్బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్​బీఐ) ముచ్చటగా మూడోసారి కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో రెపో రేటు 6 శాతం నుంచి 5.50 శాతానికి చేరనుంది. ఆర్​బీఐ నిర్ణయంతో బ్యాంకు ఈఎంఐలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీరేట్లు తగ్గనున్నాయి.  ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా వెల్లడించారు.
ఆర్​బీఐ ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్‌ నెలల్లోనూ కీలక వడ్డీరేట్లను 25 బేసిస్‌ పాయింట్లు మేర తగ్గించింది. తాజా ప్రకటనతో ఈ ఏడాదిలో రెపో రేటు ఇప్పటి వరకు ఒక శాతం మేర తగ్గింది. దేశ ఆర్థిక వృద్ధిని పెంపొందించడం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. మరోవైపు స్టాండింగ్‌ డిపాజిట్‌ ఫెసిలిటీ రేటును 5.25 శాతంగా ఉంచిన ఆర్‌బీఐ, మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిలిటీ రేటును 5.75 శాతంగా ఉంచింది.
ఈ విధంగా ద్రవ్య పరపతి విధాన కమిటీ సర్దుబాటు వైఖరి నుంచి స్థిర విధానానికి మారాలని నిర్ణయించినట్లు ఆర్​బీఐ గవర్నర్​ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో గృహ రుణాల వడ్డీరేట్లు 7.5 శాతం తగ్గనున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా, స్థిరంగా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితులు నెలకొన్నా భారత్​ వేగంగా వృద్ధి చెందుతోంది. కనుక పెట్టుబడిదారులకు మన దేశంలో అపార అవకాశాలు ఉన్నాయని మల్హోత్రా చెప్పారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5శాతంగా నమోదయ్యే అవకాశం ఉంది. 

తొలి త్రైమాసికంలో 6.5శాతం, రెండో త్రైమాసికంలో 6.7శాతం జీడీపీ నమోదు కావచ్చని అంచనా. మూడు, నాలుగు త్రైమాసికాల్లో వృద్ధి రేటు వరుసగా 6.6శాతం, 6.4శాతం ఉండవచ్చని వివరించారు.  ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పడుతున్నాయని, కనుక 2025-26 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాలను 4శాతం నుంచి 3.7శాతానికి తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు.

బ్యాంకుల వద్ద నగదు నిల్వల (సీఆర్​ఆర్​) నిష్పత్తిని 100 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్లు వెల్లడించారు.  రూ.2.5 లక్షల కోట్ల మేర బ్యాంకు నిధులను విడుదల చేయనున్నమని, దీని వల్ల బ్యాంకులు మరిన్ని రుణాలు మంజూరు చేసేందుకు వీలు కలుగుతుందని చెప్పారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు రూ.9.5 లక్షల కోట్లు ద్రవ్యాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకొచ్చామని తెలిపారు.

భారత్​లో విదేశీ మారక నిల్వలు 691.5 బిలియన్‌ డాలర్ల మేర ఉన్నాయి. అందువల్ల మరో 11 నెలల వరకు దిగుమతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టబడులు తగ్గుముఖం పట్టాయి. ఈక్విటీల్లో లాభాల స్వీకరణకు మొగ్గుచూపతుండడమే ఇందుకు కారణం. ప్రస్తుతం విదేశీ పెట్టుబడులు 1.7 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయని వివరించారు.