పాక్ నుంచే 500 మందితో భారీ స్లీపర్‌ సెల్‌ నెట్‌వర్క్‌

పాక్ నుంచే 500 మందితో భారీ స్లీపర్‌ సెల్‌ నెట్‌వర్క్‌
 
* లాహోర్ ట్రావెల్ ఏజెన్సీ నుంచే కార్యకలాపాలు
 
భారత ఇన్‌ఫ్లూయెన్సర్లు పాకిస్థాన్‌లో ప్రయాణించేందుకు అవసరమైన సాయం చేసిన వ్యక్తిని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. పాక్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ కింద పనిచేస్తూ లాహోర్‌లో ‘జైయానా ట్రావెల్‌ అండ్‌ టూరిజం’ పేరుతో ఓ ట్రావెల్‌ ఏజెన్సీ నిర్వహిస్తున్న వ్యక్తిని నోషాబా షెహ్జాద్‌గా గుర్తించారు.  ఇటీవల అరెస్ట్‌ అయిన భారత సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను విచారిస్తున్నప్పుడు ఈ విషయం బయటపడింది. ఐఎస్‌ఐ ఆమెను ‘మేడమ్‌ ఎన్‌’ అనే కోడ్‌నేమ్‌తో పిలిచేది. 
భారత యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా వంటి సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతోపాటు మరెంతోమంది పాక్‌ సందర్శించేందుకు ఆమె సాయం చేసింది.  భారత్‌లో 500 మంది గూఢచారులతో కూడిన భారీ స్లీపర్‌ సెల్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటుకు ఆమె కృషి చేసింది. వ్యాపారవేత్త అయిన షెహజాద్‌ భర్త పాకిస్థాన్‌ సివిల్‌ సర్వీస్‌లో పనిచేసి రిటైరయ్యారు. పాక్‌ ఆర్మీ, ఐఎస్‌ఐ నుంచి ఆమెకు ఎప్పటికప్పుడు సూచనలు అందేవి. పాక్‌ సందర్శించే భారత సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను ఆమె పాక్‌ సైన్యం, ఐఎస్‌ఐకి పరిచయం చేసేది.

గత ఆరు నెలల్లో భారత్‌ నుంచి 3 వేల మంది పౌరులు, 1500 ప్రవాస భారతీయులు పాకిస్థాన్‌ సందర్శించేందుకు ఆమె సాయం చేసినట్టు గుర్తించారు. భారత్‌లో ఐఎస్ఐ ఏజెంట్లను నియమించడంలో వారికి పాకిస్థాన్‌ ప్రయాణం కల్పించడంలోనూ, గూఢచార్య నెట్‌వర్క్‌ను స్థాపించడంలోనూ చాలా చురుకైన పాత్ర పోషించింది.  అంతేకాదు, భారత యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లు యెన్సర్లకు టూరిస్ట్ వీసాలు ఇప్పించి ఆర్థికంగా బాగా లాభపడింది కూడా. 

భారతీయ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు తన దేశానికి ప్రయాణించడానికి సహాయం చేయడమే కాదు, వారిని ఐఎస్ఐ గూఢచారులుగా ఉపయోగించుకోవడానికి కూడా పునాది వేసిందని దర్యాప్తు వర్గాలు అంటున్నాయి.  భారతదేశంలో స్లీపర్ సెల్ నెట్‌వర్క్‌ను ఎలా ఏర్పాటు చేయాలనేదానిపై నోషాబాకు పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ సూచనలు, సలహాలు ఇస్తుంటాయి. ఈమె భర్త రిటైర్డ్ పాకిస్థాన్ సివిల్ సర్వీసెస్ అధికారి. ఈమె చాలా మంది భారతీయ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌లను పాక్ సైన్యం, ఐఎస్ఐ లకు పరిచయం చేసిందని, భారత్‌లో నివసిస్తున్న హిందువులు, సిక్కులను ఆకర్షిస్తుందని చెబుతున్నారు

ఢిల్లీలోని పాక్‌ రాయబార కార్యాలయంతోనూ ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో ఆమె కోరుకున్న వ్యక్తికి చిటికెలో వీసా లభించేది. పాక్‌ రాయబార కార్యాలయంలో వీసా అధికారిగా పనిచేసిన ఐఎస్‌ఐ ఆపరేటివ్‌ డానిష్‌ అలియాస్‌ ఎహ్సాన్‌-ఉర్‌-రెహ్మాన్‌తోనూ ఆమెకు సంబంధాలున్నాయి. జ్యోతి మల్హోత్రా వ్యవహారం బయటపడిన తర్వాత మే నెలలో డానిష్‌ను భారత్‌ నుంచి బహిష్కరించారు.

ఆమె వీసా విభాగం మొదటి కార్యదర్శి (వీసా) సుహైల్ కమర్, కౌన్సెలర్ (వాణిజ్యం) ఉమర్ షెర్యార్‌తో చాలా సార్లు సంప్రదింపులు జరిపింది. మరోవైపు, శ్రీమతి షెహజాద్ భారతీయ యాత్రికుల నుండి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసి, ఆ నిధులను పాకిస్తాన్‌ను ప్రమోట్ చేయడానికి ఉపయోగించారని సదరు వర్గాలు తెలిపాయి. ఆమె ఇటీవల ఢిల్లీతోపాటు, మరిన్ని నగరాల్లో కొంతమంది ట్రావెల్ ఏజెంట్లను నియమించింది. వారంతా ఇప్పుడు ఆమె కంపెనీని సోషల్ మీడియాలో బాగా ప్రమోట్ చేస్తున్నారు.