అమెరికా అధ్యక్ష ఎన్నికలలో సొంత డబ్బు ఖర్చుపెట్టి డొనాల్డ్ ట్రంప్ గెలుపు కోసం విశేషంగా కృషి చేసిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ల మధ్య స్నేహబంధం చెడినట్టే కనిపిస్తున్నది. డోజ్ బాధ్యతల నుంచి వైదొలగడానికి ముందే వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు నెలకొన్నట్టు తెలుస్తున్నది. ఈ విభేదాల ప్రభావం నేరుగా టెస్లా షేర్లపై పడింది. దీనితో టెస్లా షేర్లు ఏకంగా 14 శాతం మేర క్షీణించాయి. ఫలితంగా 152 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.13 లక్షల కోట్లు) సంపద ఆవిరైంది.
అమెరికన్లకు పన్ను తగ్గించేందుకు తీసుకొచ్చిన బిగ్ టాక్స్ బ్రేక్ బిల్లు వారిద్దరి మధ్య దూరానికి ఈ బిల్లే ప్రధాన కారణమని చెప్తున్నారు. ఈ బిల్లుతో ధనికులకు 4.5 లక్షల కోట్ల డాలర్ల మేర లబ్ధి చేకూరి, పేదలకు ఉద్దేశించిన సంక్షేమ పథకాలు మరుగున పడుతాయని మస్క్ తప్పుబడుతున్నారు. ఇదో అసహ్యకరమైన బిల్లుగా ఆయన అభివర్ణించారు. రుణ పరిమితిని పెంచి అమెరికా ఆర్థికాన్ని దివాలా తీయించేలా ఉన్న ఇలాంటి బిల్లుకు మద్దతిచ్చిన వారికి సిగ్గు ఉండాలని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘కిల్ ది బిల్’ అంటూ ట్వీట్ చేశారు.
అయితే, ఎలక్ట్రిక్ కార్లకు రాయితీ తగ్గింపు అంశం బిల్లులో ఉండటం వల్లే మస్క్ దీన్ని వ్యతిరేకిస్తున్నారని ట్రంప్ వర్గం ఎదురుదాడికి దిగుతున్నది. మస్క్‌కు ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్‌కు మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఓపెన్‌ఏఐకు చెందిన చాట్‌బాట్ చాట్‌జీపీటీకి పోటీగా మస్క్ గ్రోక్‌ను తీసుకొచ్చారు. అయితే, తనను కాదని ఆల్ట్‌మన్‌తో ట్రంప్ ప్రైవేట్‌గా భేటీ కావడం మస్క్‌కు ఆగ్రహాన్ని తెప్పించింది.
డోజ్‌లో సభ్యుడిగా ఉన్న కొత్తలో శ్వేతసౌధానికి తరచూ వచ్చే మస్క్ ట్రంప్‌తో అభిప్రాయభేదాలు మొదలైన తర్వాత వైట్‌హౌస్‌కు రావడాన్ని తగ్గించారు. దీంతో మస్క్‌కు అప్పజెప్పిన బాధ్యతలను పర్యవేక్షించడానికి, తనకు వివరాలు ఇవ్వడానికి ట్రంప్ మరో అధికారిని నియమించారు. ఇది మస్క్‌కు ఆగ్రహాన్ని తెప్పించింది. మరోవంక, ప్రభుత్వ వృథా ఖర్చు తగ్గింపునకు తొలుత మస్క్ ఇచ్చిన సూచనలను ట్రంప్ సహా పార్టీ సభ్యులు కూడా హర్షించారు.

More Stories
సుదీర్ఘ యుద్ధాలతో ఇజ్రాయిల్ ప్రజల్లో మానసిక సమస్యలు
అమెరికా- ఇరాన్ మధ్య ప్రాథమిక ఒప్పందం
కెనడాలో భారత విద్యార్థిని దారుణ హత్య