
బలప్రయోగంతో, ఒత్తిడిని ఉపయోగించి మత మార్పిడి చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, అది హింసాత్మక చర్య అని ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ స్పష్టం చేశారు.
గురువారం నాగ్‌పూర్‌లో జరిగిన కార్యకర్త వికాస్ వర్గ్ ముగింపు కార్యక్రమంలో ప్రసంగిస్తూ “మాత మార్పిడి హింస. ఇష్టానుసారం చేసినప్పుడు మేము దానిని వ్యతిరేకించడం లేదు. కానీ ఆకర్షించడం, బలవంతం చేయడం, ఒత్తిడి చేయడంకు మేము వ్యతిరేకం. వారి పూర్వీకులు తప్పు చేశారని ప్రజలకు చెప్పడం ద్వారా, అది వారిని అవమానించడమే. మేము అలాంటి పద్ధతులకు వ్యతిరేకం” అని ఆయన స్పష్టం చేశారు.
“(మత మార్పిడికి వ్యతిరేకంగా పోరాటంలో) మేము మీతో ఉన్నాము” అని భగవత్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గిరిజన నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అరవింద్ నేతమ్‌ను ఉద్దేశించి చెప్పారు. కాగా, ఆపరేషన్ సిందూర్ తర్వాత రాజకీయ వర్గం పరస్పర అవగాహనను చూపించిందని, సమాజం ఐక్యత సందేశాన్ని ఇచ్చిందని డా. భగవత్ సంతోషం వ్యక్తం చేశారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత రాజకీయ వర్గం ప్రదర్శించిన అవగాహన, తరువాత భారతదేశం తీసుకున్న చర్య కొనసాగాలని, శాశ్వత లక్షణంగా మారాలని ఆయన అభిలాషను వ్యక్తం చేశారు. “పహల్గాంలో ఒక క్రూరమైన దాడి జరిగింది. ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చి మన పౌరులను చంపారు. అందరూ విచారంగా, కోపంగా ఉన్నారు. నేరస్థులకు శిక్ష విధించాలని కోరుకున్నారు. నిజంగానే చర్య తీసుకున్నారు” అని ప్రశంసించారు.
“ఈ విషయంలో, మన సైన్యం సామర్థ్యం, ధైర్యం మరోసారి ప్రకాశించింది. రక్షణలో పరిశోధన ప్రభావం నిరూపించబడింది. ప్రభుత్వం, పరిపాలన దృఢత్వాన్ని మనమందరం చూశాము. అన్ని రాజకీయ పార్టీల అవగాహన, పరస్పర సహకారాన్ని కూడా మనం చూస్తున్నాము. అన్ని తేడాలను మరచిపోతాము. ఇది శాశ్వతంగా మారితే, సమస్యలు పాతబడుతున్న కొద్దీ మసకబారితే, అది దేశానికి గొప్ప ఉపశమనం కలిగిస్తుంది” అని సర్ సంఘచాలక్ తెలిపారు.
“ఈ దేశభక్తి వాతావరణంలో మనం అన్ని తేడాలు, పోటీలను మరచిపోయినట్లుగా, ఈ ఆదర్శప్రాయమైన ప్రజాస్వామ్య దృశ్యం రాబోయే కాలంలో కూడా కొనసాగాలి. మనమందరం దీనిని కోరుకుంటున్నాము” అని ఆయన చెప్పారు. ఏప్రిల్ 22న పహల్గాంలో పర్యాటకుల ఊచకోత తర్వాత, ప్రజలు కోపంగా ఉన్నారు. దోషులను శిక్షించాలని కోరుకున్నారని గుర్తు చేశారు.
ఆ చర్య తరువాత, భారత సాయుధ దళాలు పాకిస్తాన్, ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని, పొరుగు దేశంలోని వైమానిక స్థావరాలపై ప్రతీకార దాడులలో బాంబు దాడి చేసిన ఆపరేషన్ సిందూర్‌ను పరోక్షంగా ఆయన ప్రస్తావించారు. మే 7-10 తేదీలలో జరిగిన భారత్- పాకిస్తాన్ సైనిక సంఘర్షణను మరోసారి ప్రస్తావిస్తూ, పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత తీసుకున్న చర్యలో దేశ నిర్ణయాధికారుల దృఢ సంకల్పాన్ని అందరూ చూశారని ఆయన పేర్కొన్నారు.
పాకిస్తాన్ పేరు చెప్పకుండానే, భగవత్ మాట్లాడుతూ, “భారతదేశంతో ప్రత్యక్ష పోరాటంలో గెలవలేని వారు వెయ్యి కోతలు, పరోక్ష యుద్ధం అనే విధానం ద్వారా మన దేశాన్ని రక్తసిక్తం చేయాలనుకుంటున్నారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, బ్రిటన్ లొంగిపోతుందని ఆశిస్తూ హిట్లర్ దాదాపు ఒక నెల పాటు లండన్‌పై బాంబు దాడి చేశాడని గుర్తు చేశారు.
దీనికి ప్రతిస్పందనగా, ప్రధాన మంత్రి విన్స్టన్ చర్చిల్ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించి, తరువాత పార్లమెంటుకు “బ్రిటిష్ వారు సముద్రాలలో,బీచ్‌లలో” పోరాడతారని చెప్పారు. ఈ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ, సమాజం నిజమైన సింహం అని చర్చిల్ చెప్పారని, దాని తరపున అతను కేవలం గర్జించాడని భగవత్ వ్యాఖ్యానించారు.
ఒకరి లాభం కొన్నిసార్లు మరొకరికి నష్టాన్ని కలిగిస్తుందని, వ్యక్తుల మధ్య అవగాహన లేకపోవడం అసంతృప్తికి దారితీస్తుందని సర్ సంఘచాలక్ తెలిపారు. అయితే, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా, ఏ సమూహం లేదా తరగతి మరొకరితో వివాదంలోకి రాకూడదని స్పష్టం చేశారు. ఉద్రేకంతో వ్యవహరించడం, అనవసర వాదనల్లో పాల్గొనడం లేదా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం దేశ ప్రయోజనాలకు మంచిది కాదని ఆయన హెచ్చరించారు.
భారతదేశం స్వతంత్రంగా లేని సమయంలో (బ్రిటిష్) పాలకులు విభజనలను ప్రోత్సహించి, విధ్వంసక శక్తులకు మద్దతు ఇచ్చారని, సాధారణ ప్రజలు పోరాటాన్ని చేపట్టేలా బలవంతం చేశారని ఆయన పేర్కొన్నారు. అయితే, నేడు ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం పనిచేస్తుందని చెబుతూ, ఇటువంటప్పుడు దుర్వినియోగ భాష, అతిగా స్పందించకుండా ఉండాలని భగవత్ హితవు చెప్పారు.
కొంతమంది వ్యక్తులు వ్యక్తిగత లాభం కోసం రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తారని పేర్కొన్నారు. “మన మూలాలు విభజనలో కాదు, ఐక్యతలో ఉన్నాయి” అని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు వేర్వేరు భాషలు మాట్లాడవచ్చు, విభిన్న ఆచారాలను అనుసరించవచ్చు, ఐక్యత అన్ని తేడాలకు అతీతంగా నిలుస్తుందని ఆయన తెలిపారు. భారతీయులలో జాతి భేదాల ఆలోచన బ్రిటిష్ వలస పాలన ద్వారా పెంపొందించబడిన తప్పుడు భావన అని భగవత్ చెప్పారు.
More Stories
‘స్థానిక’ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్
ఎమర్జెన్సీ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి
నకిలీ ఆధార్ కార్డుల తయారీలో బెంగాల్ లో నలుగురు అరెస్ట్