రెపో రేటును తగ్గించడంతో తగ్గుతున్న వడ్డీ రేట్లు

రెపో రేటును తగ్గించడంతో తగ్గుతున్న వడ్డీ రేట్లు
 
 రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక రెపోరేటును 50 బేసిస్‌ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో బ్యాంక్‌లు ఆ బాటలో నిర్ణయాలు తీసుకుంటున్నాయి. రుణ ఖాతాదారులకు వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పిఎన్‌బి), ఇండియన్‌ బ్యాంక్‌, యూకో బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బిఒఐ), కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ (కెవిబి) వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. పిఎన్‌బి రుణాలపై రెపో లింక్డ్‌ లెండింగ్‌ రేటు (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌)ను 8.85 శాతం నుంచి 8.35 శాతానికి కోత పెడుతోన్నట్లు వెల్లడించింది. కొత్త వడ్డీ రేట్లు జూన్‌ 9 నుంచి అమల్లోకి రానున్నాయని తెలిపింది.
 
యూకో బ్యాంక్‌ కూడా అన్ని రకాల కాలపరిమితి రుణాలపై మార్జినల్‌ కాస్ట్‌ ఆప్‌ లెండింగ్‌ రేటు (ఎంసిఎల్‌ఆర్‌)ను 10 బేసిస్‌ పాయింట్లు తగ్గించినట్లు పేర్కొంది. జూన్‌ 10 నుంచి కొత్త రేట్లు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. దీంతో ఒక్క పూట నుంచి ఏడాది కాలపరిమితిపై వడ్డీ రేట్లు 8.15 శాతం నుంచి 9 శాతం వరకు నిర్ణయించింది. కొత్త వడ్డీ రేట్లు జూన్‌ 10 నుంచి అమల్లోకి వస్తాయని యూకో బ్యాంక్‌ తెలిపింది. 
 
కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ ఆరు నెలల ఎంసిఎల్‌ఆర్‌ను 9.90 శాతం నుంచి 9.80 శాతంగా, ఏడాది కాలపరిమితి ఎంసిఎల్‌ఆర్‌ను 10 శాతం నుంచి 9.80 శాతానికి కుదించింది. కొత్త రేట్లు జూన్‌ 7 నుంచే అమల్లోకి వచ్చాయని వెల్లడించింది. ఇండియన్‌ బ్యాంక్‌ రుణాలపై వడ్డీ రేట్లను 8.70 శాతం నుంచి 8.20 శాతానికి కోత పెట్టింది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా 8.85 శాతం నుంచి 8.35 శాతానికి తగ్గించింది. 
 
జూన్‌ 6 నుంచే కొత్త రేట్లను అమలు చేస్తున్నట్లు ఇరు బ్యాంక్‌లు వేరువేరుగా ప్రకటించడం విశేషం. ఆర్‌బిఐ ఎంపిసి భేటీలో రెపోరేటును తాజాగా 50 బేసిస్‌ పాయింట్లు తగ్గించి తద్వారా 5.50 శాతానికి చేర్చింది. ఇంతక్రితం ఫిబ్రవరిలో 25 బేసిస్‌ పాయింట్లు, ఏప్రిల్‌ లో 25 బేసిస్‌ పాయింట్లు చొప్పున వడ్డీ రేట్లను తగ్గించిన విషయం తెలిసిందే. మొత్తంగా రుణాలపై వడ్డీ ఒక్క శాతం మేర కోత విధించడంతో పాత, కొత్త గృహ, వాహన, వ్యక్తిగత తదితర రుణగ్రహీతలపై వడ్డీ భారం కొంత ఉపశమనం లభించనుంది.