ఉగ్రవాదులు పాక్‌లో ఎక్కడున్నా వేటాడుతాం

ఉగ్రవాదులు పాక్‌లో ఎక్కడున్నా వేటాడుతాం

పహల్గాం తరహాలో మరో ఉగ్రదాడి జరిగితే భారతదేశం తప్పకుండా స్పందిస్తుందని, ఉగ్రవాదులు పాకిస్తాన్‌లో ఎక్కడున్నా వేటాడి మరీ దాడి చేస్తుందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హెచ్చరించారు. ఆమ్‌స్టర్‌డామ్‌లో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్ – పాక్ కాల్పుల విరమణకు తానే మధ్యవర్తిత్వం వహించానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసుకుంటున్న ప్రచారాన్ని కొట్టిపారేసారు.

మే 10న జరిగిన అవగాహన ఒప్పందం న్యూఢిల్లీ-ఇస్లామాబాద్ మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల ఫలితమని స్పష్టం చేశారు. “రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పుడు.. ప్రపంచంలోని ఇతర దేశాలు సంప్రదించి తమ ఆందోళనను తెలియజేయడం సహజం. కానీ, కాల్పుల విరమణ, సైనిక చర్యలను నిలిపివేయడం అనేది పూర్తిగా భారత్‌-పాక్‌ మధ్య నేరుగా జరిగిన చర్చల ఫలితం” అని తెలిపారు. 

“మే 10న పాక్‌ ఆర్మీ నుంచి మాకు ఒక సందేశం వచ్చింది. కాల్పులు ఆపడానికి తాము సిద్ధంగా ఉన్నామని దాని సారాంశం. దీనిపై రెండు దేశాల ప్రతినిధులు హాట్‌లైన్‌ ద్వారా చర్చలు జరిపారు” అని చెప్పారు. అయితే, ఈ సందర్భంగా అమెరికానే కాకుండా పశ్చిమాసియా, ఇతర దేశాల నాయకులు కూడా ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో భారత్‌ను సంప్రదించినట్లు జైశంకర్‌ చెప్పుకొచ్చారు.

”ఆపరేషన్ సిందూర్‌ను భారత్ కొనసాగించడం వెనుక ఒక సందేశం ఉంది. ఉగ్రవాదంపై పోరాటంలో రాజీపడని భారతీయ తత్వానికి ఇది నిదర్శనం. ఆపరేషన్‌ను కొనసాగించడం అంటే ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకోవడం కాదు. ప్రస్తుతానికైతే భారత్ -పాక్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతోంది. సైనిక చర్యలు ఆగిపోయాయి” అని ఆయన పేర్కొన్నారు. 

ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన జాబితాలో ప్రస్తావించిన ఉగ్రవాద స్థావరాలపైనే భారతదేశం దాడి చేసిందని ఆయన గుర్తు చేశారు. ”ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంపై పాశవిక ఉగ్రదాడి జరిగింది. 26 మంది పర్యాటకులను వారి కుటుంబ సభ్యుల ఎదుటే హత్య చేశారు. మతం వివరాలను అడిగి మరీ ఆ పర్యాటకులను చంపారని తెలిపారు.

కశ్మీర్ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారమైన పర్యాటక రంగాన్ని దెబ్బతీసేందుకే ఇలా చేశారని, భారత్‌లో మతపరమైన విభేదాలను సృష్టించాలని పాక్ ఉగ్రవాదులు కుట్ర పన్నారని జైశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ”పాక్ ఆర్మీ చీఫ్ తీవ్రమైన మతతత్వంతో ముందుకు సాగుతున్నాడు. పహల్గాం ఉగ్రవాద దాడికి పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తయిబాకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్) బాధ్యత వహించింది. ఈ ఉగ్రదాడికి పాల్పడిన వారిని భారత్ గుర్తించింది. వారికి లష్కరే తయిబాతో సంబంధాలు ఉన్నాయి” అని ఆయన వెల్లడించారు.

 ”2023, 2024 సంవత్సరాల్లో ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్) గురించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి చెందిన 1267 ఆంక్షల కమిటీకి భారత్ తెలియజేసింది” అని జైశంకర్ గుర్తు చేశారు.