మహిళల సిందూరాన్ని చెరిపిన వారిని మట్టిలో కలిపేశాం

మహిళల సిందూరాన్ని చెరిపిన వారిని మట్టిలో కలిపేశాం

* దేశవ్యాప్తంగా 103 అమృత్‌ భారత్‌ స్టేషన్లు ప్రారంభించిన మోదీ

ఆపరేషన్ సిందూర్‌ ద్వారా ఉగ్రవాదులను తుదముట్టించినట్లు ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. తమ ప్రభుత్వం త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు ప్రధాని తెలిపారు. మన మహిళల సిందూరాన్ని చెరిపేసిన వాళ్లను మట్టిలో కలిపేసినట్లు చెప్పారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు, అత్యాధునిక సదుపాయాలతో వివిధ రాష్ట్రాల్లో అభివృద్ధి చేసిన 103 అమృత్‌ భారత్‌ రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ ప్రారంభించారు. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకంలో భాగంగా మొత్తం 18 రాష్ట్రాల్లో తీర్చిదిద్దిన వీటిని రాజస్థాన్‌లోని బికనీర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంబించారు.

ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని “ఆపరేషన్‌ సిందూర్‌ పట్ల దేశ ప్రజలంతా గర్వపడుతున్నారు. త్రివిధ దళాలు చక్రవ్యూహాలు పన్ని శత్రువులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. మన మహిళల సిందూరం చెరిపేసిన వాళ్లను మట్టిలో కలిపేశాం. పహల్గాం ఘటనకు జవాబుగా 22 నిమిషాల్లోనే ఉగ్రవాదులను మట్టుబెట్టాం. మన సాయుధ దళాలు పాక్‌ను మోకాళ్ల మీద నిలబెట్టాయి” అని చెప్పుకొచ్చారు. 

“భారత్‌లో రక్తపుటేర్లు పారించినవాళ్లను ముక్కలు ముక్కలు చేశాం. ఆపరేషన్ సిందూర్‌ న్యాయానికి కొత్త రూపం. సమర్థ భారత రౌద్ర రూపం. ఉగ్రదాడి జరిగితే, మన సమాధానం ఇలాగే ఉంటుంది. ఉగ్రవాదులకు ఇకపై ఇలాంటి జవాబే దక్కుతుంది” అని ప్రధాని మోదీ తెలిపారు.

“పాకిస్థాన్‌ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు మన ఎంపీలు విదేశాలకు వెళ్లారు. పాకిస్థాన్‌ నిజ స్వరూపాన్ని మన ఎంపీలు ప్రపంచానికి చాటుతారు. పాక్‌ ఎప్పుడూ మనతో నేరుగా యుద్ధం చేయలేదు. దొంగదెబ్బ తీయడమే పాకిస్థాన్‌కు తెలుసు. ఇక్కడ మోదీ ఉన్నారనే సంగతి పాకిస్థాన్‌ మరిచిపోయినట్టుంది. రాజస్థాన్‌లోని ఎయిర్‌బేస్‌ను ధ్వంసం చేయాలని పాక్ ప్రయత్నించింది. కానీ, రాజస్థాన్‌ ఎయిర్‌బేస్‌ను పాకిస్థాన్‌ క్షిపణులు తాకలేకపోయాయి. మన వాయుసేన మాత్రం పాక్‌లోని ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేసింది” అని మోదీ పేర్కొన్నారు.


‘ఇక్కడికి కర్ణిమాత ఆశీస్సులు తీసుకుని వచ్చా. గత 12 ఏళ్లుగా దేశంలో ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పించే మహా యజ్ఞం జరుగుతోంది. గతంలో కంటే ఆరు రెట్లు ఆధికంగా మౌలిక సదుపాయాలపై ఖర్చు చేస్తున్నాం. కశ్మీర్‌ నుంచి అరుణాచల్‌ప్రదేశ్ వరకు మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నాం” అని ప్రధాని తెలిపారు. 
“గతంలో రైల్వేస్టేషన్లు ఎలా ఉండేవి, ఇప్పుడెలా ఉన్నాయో ఆలోచించండి. అమృత్‌ భారత్‌ స్టేషన్లను ఆయా ప్రాంతాల ప్రత్యేకతలతో నిర్మించాం. ఈ రైల్వే స్టేషన్లకు ప్రజలే యజమానులు. శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలదే” అని మోదీ చెప్పారు.

దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లోని 86జిల్లాల్లో అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకంలో భాగంగా ఆధునీకరించిన 103 రైల్వేస్టేషన్లను ప్రధాని రాజస్థాన్‌లోని బీకానేర్‌లో జెండా ఊపి వర్చువల్‌గా ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. తెలంగాణలో బేగంపేట, కరీంనగర్‌, వరంగల్‌, ఏపీలో సూళ్లూరుపేట రైల్వేస్టేషన్లు ఉన్నాయి. యూపీలో 19, గుజరాత్‌లో 18, మహారాష్ట్రలో 15, రాజస్థాన్‌లో 8 అమృత్‌ భారత్‌ స్టేషన్లు ఉన్నాయి. 

ఆ తర్వాత ప్రధాని మోదీ, పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం రాజస్థాన్‌లో 26వేల కోట్లతో చేపట్టనున్న వేర్వేరు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.