
పాకిస్థాన్ ప్రాయోజిక తీవ్రవాదం, ఆపరేషన్ సిందూర్ గురించి యూఏఈ, జపాన్లకు పార్లమెంట్ సభ్యులతో కూడిన ప్రతినిధి బృందాలు వివరించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ కు ఇరుదేశాలు మద్దతు తెలిపాయి. జేడీయూకు చెందిన ఎంపీ సంజయ్ ఝా నేతృత్వంలోని అఖిలపక్ష దౌత్య ప్రతినిధి బృందం జపాన్లో, శివసేన పార్లమెంట్ సభ్యుడు శ్రీకాంత్ శిందే నేతృత్వంలోని మరో బృందం యూఏఈలో పర్యటించింది.
భారత్ నుంచి జపాన్ వెళ్లిన సంజయ్ ఝా నేతృత్వంలోని అఖిలపక్ష దౌత్య ప్రతినిధి బృందం ఆ దేశ విదేశాంగ మంత్రి తకేషి ఇవాయాను కలిసింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంపై భారత్ కు ఉన్న దృఢమైన నిబద్ధతను ఆయనకు వివరించింది. ఈ క్రమంలో ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి జపాన్ మద్దతు పలికింది. ఉగ్రవాద చర్యలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని కోరింది.
“మేం ఉగ్రవాదంపై భారతదేశ వైఖరిని జపాన్ విదేశాంగ మంత్రికి బలంగా తెలియజేశాం. ఆయన దాన్ని అభినందించారు. ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఉగ్రవాదంపై భారత్ వైఖరిని సమర్ధించారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని అన్నారు. పహల్గాం దాడి గురించి ఆయన తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. దాడులకు పాల్పడినవారికి శిక్షించాలని కోరారు. పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడాన్ని వ్యతిరేకిస్తూ భారత్ తో ప్రపంచ దేశాలు ఉండాలి. ఆపరేషన్ సిందూర్ గురించి వివరించడానికి జపాన్ వచ్చాం” అని సంజయ్ ఝా తెలిపారు.
పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేసే దేశమని సంజయ్ ఝా విమర్శించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమే కాకుండా వారికి నిధులు కూడా సమకూరుస్తోందని ఆరోపించారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత ఉగ్రవాద స్పాన్సర్లను సమూలంగా తుడిచిపెట్టడమే భారత్ వైఖరిని అని స్పష్టం చేశారు.
మరోవైపు, భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ టోక్యోలో ఆ దేశ ఫారెన్ సెక్రటరీ తకేహిరోతో సమావేశమయ్యారు. ఉగ్రవాదం అరికట్టంపై చర్యల గురించి వారిద్దరూ చర్చించుకున్నారు. కాగా, శివసేన ఎంపీ శ్రీకాంత్ శిందే నేతృత్వంలోని మరో అఖిలపక్ష దౌత్య బృందం యూఏఈలో పర్యటించింది. అబుదాబిలో యూఏఈ మంత్రి షేక్ నహాయన్ మబారక్ అల్ నహ్యాన్ ను కలిసింది.
పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదంపై తాము జరుపుతున్న పోరు, ఆపరేషన్ సిందూర్ గురించి ఆయనకు వివరించింది. ఈ క్రమంలో ఉగ్రవాదంపై పోరుకు భారత్కు యూఏఈ మద్దతు పలికింది. యూఏఈ, పశ్చిమ ఆఫ్రికాలకు వెళ్లే బృందానికి నాయకత్వం వహించిన శ్రీకాంద్ శిందే భారత్, పాక్ ఒకేసారి స్వాతంత్ర్యం పొందాయని, ఇండియా ఆర్థికంగా అభివృద్ధి చెందితే, పాక్ మాత్రం ఉగ్రవాదంలో పురోగతి సాధించిందని ఎద్దేవా చేశారు.
అబుదాబిలోని జాతీయ మీడియా కార్యాలయం డైరెక్టర్ జనరల్ జమాల్ మొహమ్మద్ ఒబైద్ అల్ కాబికి పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు భారత్ ఎలా బాధితురాలిగా ఉందో తెలియజేశామని శ్రీకాంత్ శిందే చెప్పారు. యూఈఏ ఉగ్రవాదానికి ఏ విధంగా కూడా మద్దతు ఇవ్వదని కాబీ ధ్రువీకరించారని పేర్కొన్నారు. “పహల్గాంలో ఉగ్రదాడిలో అమాయక ప్రజలు చనిపోయారని కాబీ చెప్పారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే దేశానికి మద్దతు తెలపమని ప్రత్యక్ష సందేశం ఇచ్చారు. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ప్రపంచ దేశాలు ఉగ్రవాదంపై పోరాడటం ముఖ్యమని అభిప్రాయపడ్డారు” అని శ్రీకాంత్ శిందే పేర్కొన్నారు.
పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదంపై తాము జరుపుతున్న పోరు గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు భారత్ మొత్తం ఏడు అఖిలపక్ష దౌత్య బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు 33 దేశాల్లో పర్యటిస్తున్నాయి.
More Stories
యోగా మానవతను పెంచే సామూహిక పక్రియ.. మోదీ
పాక్ వైమానిక, సైనిక స్థావరాలపై ట్రంప్ కన్ను!
ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధంలో ఏకాకిగా ఇరాన్